భారతీయ వంటకాలు విశ్వవ్యాప్తం అవుతున్నాయి. విదేశీయులూ ఇష్టంగా ఆరగిస్తున్నారు. దీంతో మన పాక నిపుణులు బయటి దేశాల్లో కూడా పేరు తెచ్చుకుంటున్నారు. అలాంటి స్టార్ చెఫ్‌లలో కోల్‌కతాకు చెందిన ఆస్మా ఖాన్ ఒకరు. లండన్‌లో ఆమె ప్రారంభించిన ‘డార్జిలింగ్ ఎక్స్‌ప్రెస్’ రెస్టారెంట్ ఇప్పుడొక బ్రాండ్. అమ్మతో తన అనుబంధాన్ని ప్రస్తావిస్తూ.. తనవైన వంటకాల ఘనతను జోడిస్తూ ‘అమ్ము’ అనే పేరుతో ఓ పుస్తకం వెలువరించారు ఆస్మా.
ఆస్మాకు అమ్మ అంటే ఎంత ప్రేమో, పాకశాస్త్రమంటే అంత మక్కువ. తొలిసారి చేతులు కాల్చుకున్నది మాత్రం.. పెండ్లి చేసుకుని లండన్ వెళ్లిన తర్వాతే. అమ్మ, అమ్మ చేతి వంట మరీమరీ గుర్తొచ్చేవి తనకు. ఆస్మా తల్లి కోల్‌కతాలో ‘లజీజ్’ పేరుతో క్యాటరింగ్ కంపెనీ నడుపుతారు. ఓ రెస్టారెంట్ కూడా ఉంది. ఇండియాకు వచ్చిన ప్రతిసారీ తల్లి దగ్గర ఎన్నోకొన్ని కొత్త వంటలు నేర్చుకుని వెళ్లేవారు ఆస్మా. అలా తల్లి శిక్షణలో రాటుదేలిపోయారు. కాంటినెంటల్, మొఘల్ వంటకాలలో దిట్ట అనిపించుకున్నారు. ఆమె చేతి రుచికి లండన్‌లో బాగా ప్రచారం లభించింది. దీంతో, అక్కడే ‘డార్జిలింగ్ ఎక్స్‌ప్రెస్’ పేరుతో రెస్టారెంట్ ప్రారంభించారు ఆస్మా. దాన్ని పూర్తిగా మహిళలే నడుపుతున్నారు.
మెనూలో ఎన్ని రుచులున్నా.. బిర్యానీ ప్రత్యేకతే వేరు. ‘డార్జిలింగ్ ఎక్స్‌ప్రెస్’లో బిర్యానీ ఆరగించే అవకాశం అంత సులభంగా రాదు. ముందుగా టేబుల్ రిజర్వ్ చేసుకోవాలి. హాలీవుడ్ నటులు సైతం కన్ఫర్మేషన్ కోసం ఎదురు చూస్తుంటారు. ‘ప్లేటులో కరకరలాడే సమోసా, వేడివేడి పరాటా, కాస్త చట్నీ ఉంటే ఇంకేం కావాలి? పూరీ, శెనగల కూర, క్యారెట్ హల్వా బ్రేక్‌ఫాస్ట్‌గా వడ్డిస్తే.. ఎవరు మాత్రం కాదంటారు? ఇంట్లో మనం ఏం తింటామో ఇక్కడ కూడా అదే వండుతాం. ఇంటి వంటల్ని కస్టమర్లకు రుచి చూపడమే నా పని’ అంటారీ స్టార్ చెఫ్. నెట్‌ఫ్లిక్స్ ‘చెఫ్స్ టేబుల్’ కార్యక్రమంలోనూ ఆస్మా వీడియోలు చూడొచ్చు.
ఇక, ‘అమ్ము’ విషయానికి వస్తే.. తన జీవితంలోని ప్రతి పదేండ్లనూ ఒక్కో అధ్యాయంగా విభజిస్తూ ఆత్మకథ రాసుకున్నారు. పన్లోపనిగా 100 వంటకాలను పొందుపరిచారు. ఈ పుస్తకం టాప్‌టెన్ సెల్లర్స్ జాబితాలో ఉంది.