‘సినిమాల ఎంపికలో పెద్దగా లెక్కలు వేసుకోను. మనసుకు నచ్చిన పాత్రల్ని చేసుకుంటూ వెళ్తున్నా. ‘అఖండ’ చిత్రంలో నాలోని కొత్త కోణాన్ని చూస్తారు’ అని చెప్పారు సీనియర్ హీరో శ్రీకాంత్. ఆయన ప్రతినాయకుడి పాత్రను పోషించిన చిత్రం ‘అఖండ’. బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 2న విడుదలకానుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్
గురువారం పాత్రికేయులతో సంభాషించారు. ఆయన చెప్పిన సంగతులివి..
కెరీర్ ఆరంభంలో విలన్ పాత్రలు చేశాను. ఆ తర్వాత హీరోగా సెటిలయ్యా. ఆ మధ్య ‘యుద్ధం శరణం’ అనే చిత్రంలో విలన్‌గా నటించా. ‘అఖండ’ సినిమాలో విలన్ వరదరాజులు పాత్ర గురించి దర్శకుడు బోయపాటి శ్రీను చెప్పినప్పుడు తొలుత భయపడ్డాను. అలాంటి శక్తివంతమైన పాత్రకు న్యాయం చేయగలనో లేదో అని సందేహాలు కలిగాయి. బోయపాటి సినిమాల్లో ప్రతినాయక పాత్రలు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. వరదరాజులు క్యారెక్టర్ కోసం రకరకాల గెటప్‌లు ప్రయత్నించాం. చివరకు గడ్డంతో ఉండే గెటప్ ఓకే చేశాం. అందులో నన్ను చూసుకొని నేనేనా అనుకున్నా. గెటప్ బాగుందని అందరూ ప్రశంసించడంతో నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది.
ఏది పడితే అది ఒప్పుకోకు..
‘శ్రీరామరాజ్యం’ చిత్రంలో బాలకృష్ణ పక్కన లక్ష్మణుడి పాత్రలో నటించా. అందుకు భిన్నంగా ‘అఖండ’లో ప్రతినాయకుడి పాత్రలో నటించడం కొత్తగా అనిపించింది. ‘ఈ సినిమా తర్వాత నీకు మంచి పాత్రలొస్తాయి. ఏది పడితే అది ఒప్పుకోకు. అవసరమైతే సబ్జెక్ట్‌లు నేను సూచిస్తా’ అని బాలకృష్ణ నాతో అన్నారు. ‘సినిమాలో శ్రీకాంత్ పాత్ర అదిరిపోవాలి. అలా అయితేనే ఇద్దరి మధ్య పోటాపోటీగా నటన కనిపిస్తుంది’ అంటూ సెట్స్‌లో బాలకృష్ణ ఎంతగానో ప్రోత్సహించారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డా. నా గెటప్‌తో పాటు వస్త్రధారణ విషయంలో ప్రత్యేక శ్రద్ధతీసుకున్నా. ఓ పోరాటఘట్టం కోసం ఎనిమిది రోజుల పాటు పనిచేశాం.
పరిధులు విధించుకోలేదు
ప్రస్తుతం నేను హీరోగా, విలన్‌గా అన్ని పాత్రలు చేస్తున్నా. కథల ఎంపికలో ఎలాంటి పరిధులు పెట్టుకోలేదు. నా మనసుకు నచ్చిన సబ్జెక్ట్స్ ఎంచుకుంటూ కెరీర్లో సాగిపోతున్నా. నాకు మహిళా అభిమానులు ఎక్కువ. వారు నన్ను ఇలాంటి శక్తివంతమైన విలన్ పాత్రలో ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాలి? ఈ చిత్రంలో సంభాషణలతో పాటు చైల్డ్సెంటిమెంట్ అందరిని ఆకట్టుకుంటుంది. సినిమాను థియేటర్లో చూస్తే ఆ అనుభూతి వేరుగా ఉంటుంది. ఇలాంటి చిత్రాన్ని తప్పకుండా థియేటర్లోనే చూడాలి. ప్రస్తుతం రామ్‌చరణ్-శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో ముఖ్యపాత్రను పోషిస్తున్నా. కన్నడంలో పునీత్‌రాజ్‌కుమార్ చిత్రంలో విలన్‌గా నటించా. అది వచ్చే మార్చిలో విడుదలవుతుంది.