ఆనంద్ సూపర్ 30 యూట్యూబ్‌లో ఇన్ఫినిటీ
అతనో లెక్కల మాస్టారు. కానీ అతని జీవితం మీద ఓ సినిమానే వచ్చింది. డిస్కవరీ చానెల్ డాక్యుమెంటరీ కూడా తీసింది. అంతేకాదు, పద్మశ్రీ అవార్డూ వరించింది. ఏమిటంత ప్రత్యేకం... అంటే, ఆయన దగ్గర చదువుకున్న వేల మంది విద్యార్థులు సమాధానం చెబుతారు. ఐఐటీలు, జేఈఈలు పేదపిల్లలకు దూరం కాకూడదన్న ఆశయంతో ఉచితంగా లెక్కల పాఠాలు చెబుతూ కొన్ని వేల మందిని అత్యున్నత విద్యా సంస్థల్లో చేర్చిన ఆ వ్యక్తే బీహార్‌కు చెందిన ఆనంద్ కుమార్. ‘సూపర్ 30 ఆనంద్ కుమార్'గా పేరున్న ఆయన ఈ మధ్యే సూపర్ ఇన్ఫినిటీనీ ప్రారంభించారు.
మనకు దక్కనిది ఎవరికీ దక్కకూడదు అనుకునే వాళ్లు ఒక రకం అయితే, మనకు అందని బాధ తెలుసు కాబట్టి ఎదుటి వారికి ఆ ఇబ్బంది లేకుండా చూడాలి అనుకునే వాళ్లూ ఉంటారు. రెండో కోవకు చెందుతారు బీహార్ రాష్ట్రం పాట్నాకు చెందిన ఆనంద్ కుమార్. అతనో లెక్కల మాస్టారు. తండ్రి పోస్టాఫీసులో క్లర్కు. ప్రైవేటు స్కూలుకు వెళ్లే స్తోమత లేక, హిందీ మీడియంలోనే చదువుకున్నారు. తన ప్రతిభతో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించినా, తండ్రి మరణం, కుటుంబ పరిస్థితులు ఆ అవకాశాన్ని చేజార్చాయి. కానీ అతనిలో ఆ కష్టమే పట్టుదలను పెంచింది. తనకున్న జ్ఞానాన్ని పది మందికీ పంచి వాళ్ల జీవితాలు బాగు చేయాలన్న ఆలోచనను కల్పించింది.
ఆడుతూ పాడుతూ
ఆనంద్‌కు లెక్కలంటే తొలి నుంచీ ప్రాణం. ఒక రకంగా అంకెలతో ఆటలాడేవారు. డిగ్రీలో ఉండగానే నంబర్ థియరీ మీద రీసెర్చ్ పేపర్లు సమర్పించారు. ప్రఖ్యాత గణిత అధ్యయన పత్రికల్లో అవి అచ్చయ్యాయి కూడా. 1992లో రూ.300కు ఒక చిన్న షెడ్డును అద్దెకు తీసుకుని లెక్కలు చెప్పడం ప్రారంభించారు. ‘రామానుజన్ స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్’ అని దానికి పేరు పెట్టారు. అయితే బోధనలో అతని ైస్టెలే వేరు. ముందు అంకెలతో సరదాగా ఉందాం. తర్వాతే పరీక్ష, ఫలితాలు… మిగతావన్నీ అంటారాయన. ఒకసారి కాన్సెప్ట్ అర్థం అయ్యి, నేర్చుకోవడం ఆసక్తికరమైన పనిగా మారాక విజయం దానంతట అదే వస్తుంది అన్నది ఆయన సూత్రం. తొలి ఏడాది కేవలం ఇద్దరితో ప్రారంభమైన ఆయన ఇన్స్టిట్యూట్లో విద్యార్థుల సంఖ్య మూడేండ్లలో 500 దాటింది. అయితే 2002లో ఈ ప్రయాణం ఓ మలుపు తిరిగింది. ఆనంద్‌ను ఒక పేద విద్యార్థి కలిశాడు. తాను కోచింగ్ కోసం వచ్చాననీ ఫీజు కట్టే స్తోమత లేదనీ చెప్పాడు. అందుకు ఆయన ఒప్పుకొన్నాడు.

Anandkumar 1
పేదల కోసం సూపర్ 30
ఆ పిల్లవాడు తన దగ్గరికొచ్చినప్పుడు పేదరికం కారణంగా పెద్ద చదువులకు వెళ్లలేని తన గతం గుర్తొచ్చింది ఆనంద్‌కు. అందుకే అలాంటి తెలివైన పిల్లలు ఏటా 30 మందిని ఎంపిక చేసి ఉచితంగా చదువు చెప్పి, వసతి, ఆహారం కూడా అందజేయాలనుకున్నాడు. అలా 24 ఏండ్ల క్రితం ‘సూపర్ 30’ కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో చేరిన పిల్లలు ప్రతిభకి చిరునామాలా మారారు. 2006 నుంచి 2010 దాకా సూపర్ 30లోని ప్రతి విద్యార్థీ ఐఐటీ జేఈఈ ప్రవేశ పరీక్షలో ర్యాంకులు సాధించారంటే ఆయన అంకిత భావం అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాతా ఇదే స్థాయిలో విజయ ప్రస్థానం కొనసాగుతున్నది. ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ హీరోగా 2019లో ‘సూపర్ 30’ సినిమా వచ్చింది. 2023లో విద్యారంగంలో ఆయన సేవలకు గానూ భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది.
ఇక ఇటీవల ‘సూపర్ ఇన్ఫినిటీ’ పేరిట ఆనంద్ కుమార్ ఒక యూట్యూట్ చానెల్ ప్రారంభించారు. అందులో స్కిట్లు, పాటలు, ఆటలు, నిజ జీవిత కథల ద్వారా సులభంగా అర్థమయ్యేలా గణితంలోని వివిధ కాన్సెప్ట్‌లను చెబుతారు. ప్రారంభించిన రెండు నెలల్లోనే దీనికి మూడున్నర లక్షల మంది సబ్‌స్ర్కైబర్లు అయ్యారంటే ఈ సారు పాఠం చెప్పే తీరు ఎంత బాగుంటుందో అర్థం చేసుకోవచ్చు. దీని ద్వారా దేశంలోని మరింత మంది విద్యార్థులకు గణితాన్ని చేరువ చేయాలన్నదే తన సంకల్పం అంటారాయన. ఇలాంటి వారు నూటికో కోటికో ఒక్కరుంటారు అనడం అతిశయోక్తి కాదేమో! హ్యాట్సాఫ్ ఆనంద్ సర్!!

Super30
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

