ఖరీదైన ‘సూపర్ ఫుడ్స్’ కంటే మన ఇంటి ఆహారంలోనే ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి వాటిలో ఇప్పుడు ఎక్కువగా చర్చకు వస్తున్నది అమరాంత్ (తోటకూర గింజలు). గ్లుటెన్ లేకపోవడంతో పాటు ప్రొటీన్, ఫైబర్, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలతో నిండి ఉండటం దీని ప్రత్యేకత. అమరాంత్ను కేవలం ఉపవాస ఆహారంగా మాత్రమే చూడాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. రోజువారీ ఆహారంలో రొట్టెలు, ఉప్మా, లడ్డూలు లేదా గంజి రూపంలో చేర్చుకోవచ్చు.
దీని వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలగడంతో అనవసరంగా చిరుతిళ్లు తినే అలవాటు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఆహారాన్ని మితంగా తింటే ఔషధం.. అమితంగా తింటే విషమన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఏ ఒక్క ఆహారాన్నీ అద్భుత ఔషధంగా భావించకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సమతుల ఆహారం, క్రమమైన వ్యాయామంతో కలిపి తీసుకున్నప్పుడే దీని ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. కొత్త సూపర్ ఫుడ్స్ కోసం వెతికే ముందు… మన సంప్రదాయ ధాన్యాలకు ఓసారి అవకాశం ఇవ్వడం మంచిదేగా!