Airtel postpaid : దేశంలోని ప్రముఖ టెలికామ్ సంస్థ (Telecom Company) భారతీ ఎయిర్టెల్ (Bharati Airtel) పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల (Postpaid Customers) కు షాకిచ్చింది. పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల టారిఫ్‌లను సుమారు 3 నుంచి 10 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన ధరలు ఈ నెల 8వ తేదీ (గురువారం) నుంచే అమల్లోకి వస్తాయని కంపెనీ స్పష్టంచేసింది. అయితే ధరల పెంపుతోపాటు వినియోగదారులను ఆకర్షించేందుకు కొత్తగా ఉచిత అంతర్జాతీయ రోమింగ్ (International Raoming) ప్రయోజనాన్ని కూడా జోడించింది.
తాజాగా సవరించిన ప్లాన్లు అన్నింటిలోనూ ప్రతి సిమ్‌కు ఏడాదికి ఒకసారి ఉచితంగా అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్‌ను అందిస్తున్నట్లు ఎయిర్టెల్ తెలిపింది. ఈ కాంప్లిమెంటరీ ప్యాక్‌లో భాగంగా 5 రోజుల వ్యాలిడిటీతో 5జీబీ డేటా, 60 నిమిషాల కాల్స్, 25 అవుట్గోయింగ్ ఎస్ఎంఎస్, ఉచిత ఇన్కమింగ్ ఎస్ఎంఎస్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. తరచూ విదేశీ ప్రయాణాలు చేసేవారికి ఈ కొత్త బెనిఫిట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కంపెనీ భావిస్తున్నది. ఈ ప్లాన్ల కింద అపరిమిత డేటా, కాలింగ్ సౌకర్యాలు యథావిధిగా కొనసాగుతాయి.
నూతన మార్పుల ప్రకారం.. వ్యక్తిగత కనెక్షన్ల కోసం ఉద్దేశించిన రూ.449 ప్లాన్ ధరను రూ.499కి పెంచారు. ఇక ఫ్యామిలీ ప్లాన్ల విషయానికొస్తే.. గతంలో రెండు సిమ్ల కోసం రూ.699గా ఉన్న ప్లాన్ ధర ఇప్పుడు రూ.749కి చేరింది. మూడు సిమ్‌లతో లభించే రూ.999 ప్లాన్ కోసం ఇకపై రూ.1,049 చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా నాలుగు సిమ్ల కోసం రూ.1,249, రూ.1,449 ధరలతో ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఐదు సిమ్‌లతో పాటు నెట్‌ఫ్లిక్స్ స్టాండర్డ్ సబ్‌స్క్రిప్షన్‌తో వచ్చే ప్లాన్ ధరను రూ. 1,799గా నిర్ణయించారు.
ఈ మార్పులపై భారతీ ఎయిర్టెల్ మార్కెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ అమిత్ త్రిపాఠి మాట్లాడుతూ.. భారత మార్కెట్లో తమ పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు అత్యుత్తమ శ్రేణి అనుభవాన్ని అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. దేశంలోనే అత్యుత్తమ నెట్వర్క్ అనుభవంతోపాటు 5Gపై ఫాస్ట్ లేన్ టెక్నాలజీ, స్పామ్, మోసాల నుంచి నిరంతర రక్షణ కల్పిస్తున్నామన్నారు.