మరింత ఎత్తుకు కోకాపేట
- నిర్మాణ దశలో ఆకాశహర్మ్యాలు
- 50 అంతస్తులు దాటిన హైరైజ్ భవనాల కోసం 12 దరఖాస్తులు
- అంతస్తుల కంటే ఎక్కువ ఎత్తులో భారీగా భవనాలు

సిటీబ్యూరో, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): ఆకాశమే హద్దుగా కోకాపేట ఎదుగుతోంది. కండ్లు మిరుమిట్లు గొలిపే ఆకాశహర్మ్యాలకు నిలయంగా మారుతోంది. ఏకంగా 16 చోట్ల బహుళ అంతస్తుల నిర్మాణాలు పురోగతిలో ఉండగా.. గ్రేటర్లో అత్యంత ఎత్తైన భవనం ఇక్కడే రూపుదిద్దుకుంటున్నది. సాస్ క్రౌన్ పేరుతో మూడు టవర్లు.. ఒక్కోదాన్ని 58 అంతస్తులతో నిర్మిస్తున్నారు. 55 అంతస్తులతో మరో ఆకాశహర్మ్యాన్ని పౌలోమి.. 50 అంతస్తులతో మై హోం కన్స్ట్రక్షన్ సంస్థ మై హోం లైఫ్ హబ్ పేరుతో భారీ భవనాన్ని నిర్మిస్తున్నాయి. ఇప్పటివరకు 50 అంతస్తులకు పైబడిన భవన నిర్మాణాల కోసం కోకాపేట నుంచి 12 దరఖాస్తులు రాగా.. వీటితో పాటు మరో 36 అంతస్తులకు పైబడిన మరిన్ని భారీ బహుళ అంతస్తుల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. కోకాపేట తర్వాత గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌లో భారీ అంతస్తులు వెలుస్తున్నాయి. కరోనా తర్వాత దేశంలోని మెట్రో నగరాల్లో రియల్ బూమ్ సాధారణంగా ఉండగా.. హైదరాబాద్‌లో మాత్రం ఊహించని విధంగా వృద్ధి చెందుతోంది. ఇందుకు నిదర్శనమే వెస్ట్‌జోన్ పరిధిలోని ఐటీ కారిడార్‌లో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనాలే.
ఆకర్షిస్తున్న ఐటీ కారిడార్..
గ్రేటర్ హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు హబ్ గా మారింది. ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలు తమ కార్యకలాపాలను నిర్వహిచేందుకు ఐటీ కారిడార్‌లో ఆఫీస్ స్పేస్‌ను పెద్ద మొత్తంలో అద్దెకు తీసుకుంటున్నాయి. అదే సమయంలో అక్కడ పనిచేసే ఉద్యోగులు సమీప ప్రాంతాల్లోనే నివాసాలు ఉండేలా చూసుకుంటున్నారు. దీంతో అటు ఆఫీస్ స్పేస్, ఇటు నివాస గృహాలకు డిమాండ్ పెరుగుతుండటంతో రియల్ ఎస్టేట్ సంస్థలు ఐటీ కారిడార్ కేంద్రంగానే కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నాయి. 2021లోనే పదుల సంఖ్యలో భారీ బహుళ అంతస్తుల నిర్మాణాలు మొదలు కాగా.. ప్రస్తుతం వాటి పనులు శరవేగంగా సాగుతున్నాయి.
ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌లో 18 చోట్ల..
మాదాపూర్ హైటెక్ సిటీ తర్వాత అత్యధిక ఐటీ కంపెనీలకు కేంద్రంగా గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ఉంది. ఇక్కడ మైస్కేప్ నిర్మాణ సంస్థ 52 అంతస్తులతో ఒక టవర్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అదేవిధంగా సాస్ డౌన్ టౌన్ 51 అంతస్తులు, హెచ్ఆర్ఐ క్యాపిటల్ 47 అంతస్తులు, ఏక్తా వెస్ట్రర్న్ నిర్మాణ సంస్థ 46 అంతస్తులతో 4 టవర్లను 170 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు స్థలాన్ని చదును చేస్తోంది. వీటితో పాటు డీఎస్ఆర్ ది ట్విన్స్, ఫీనిక్స్ బీ హబ్, సుమధుర ఒలంపస్ సంస్థలు ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌లో 45 అంతస్తులతో ఆకాశహర్మ్యాలను నిర్మిస్తున్నాయి.
లింగంపల్లిలో 5 టవర్లు 53 అంతస్తులతో….
- ఐటీ కారిడార్‌లో భాగంగా ఉన్న లింగంపల్లిలో క్యాండూర్ క్రిసెంట్ నిర్మాణ సంస్థ 53 అంతస్తులతో 5 టవర్లను నిర్మిస్తోంది. ఇక్కడి భవనాల ఎత్తు 176.25 మీటర్లు. ప్రస్తుతం నిర్మాణాల కోసం స్థలాన్ని సిద్ధం చేస్తున్నారు.
- నివాస ప్రాంతాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న తెల్లాపూర్‌లో స్కై గార్డెన్స్ సంస్థ 45 అంతస్తులతో రెండు టవర్లు, 42 అంతస్తులతో మూడు టవర్లను నిర్మిస్తోంది.
- మంచిరేవులలో 48 అంతస్తులతో నార్త్‌స్టార్ రియల్ ఎస్టేట్ సంస్థ ఐ ఇన్ ద స్కై పేరుతో హైరైజ్ భవనాన్ని 168.75 మీటర్ల ఎత్తులో నిర్మిస్తోంది.
- ఖాజాగూడలో సాస్ ఐ టవర్‌ను 38 అంతస్తులతో నిర్మిస్తుండగా, అర్బన్వుడ్ త్రైవ్ సంస్థ 39 అంతస్తులతో భారీ బహుళ అంతస్తుల భవానాన్ని కడుతోంది.

మెరుగైన వసతులు..
ఐటీ కారిడార్‌లో నిర్మాణ రంగం జోరు మీదుండటానికి కారణం అక్కడ ఉన్న మౌలిక వసతులేనని పలువురు పేర్కొంటున్నారు. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వవరకు ఔటర్ రింగ్‌రోడ్డు అత్యంత ఆకర్షణీయంగా మారింది. ఓఆర్ఆర్కు ఓ వైపు కోకాపేట ఉంటే మరోవైపు గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ఉంది. ఈ రెండు ప్రాంతాల్లోనే సుమారు 34 భారీ బహుళ అంతస్తుల భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) చేపట్టిన కోకాపేట నియో పోలిస్ లే అవుట్, దానికి అనుసంధానంగా ఇంటర్ చేంజ్ల నిర్మాణాలు ఈ ప్రాంతంలో రియల్ బూమ్‌ను మరింత పెంచాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

