అహ్మదాబాద్, సెప్టెంబర్ 24 : తమ సమాజంలో తగ్గుతున్న జనాభా సమస్యకు పరిష్కారం వెదికే క్రమంలో కచ్ కడ్వా పాటిదార్ సమాజ్(కేకేపీఎస్) ఒక వినూత్న పథకాన్ని ప్రకటించింది. తమ సమాజానికి చెందిన తల్లిదండ్రులు మూడవ బిడ్డకు జన్మనిస్తే వారికి రూ.50,000 మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్‌గా అందిస్తామని కేకేపీఎస్ వెల్లడించింది. ఇటీవల జరిగిన దక్షిణ గుజరాత్ ప్రాంతీయ సమావేశంలో ఈ పథకంపై చర్చ జరిగింది.
యువ జంటలు ఒక్క బిడ్డతో సరిపెట్టుకోవడం లేదా అసలు పిల్లలు వద్దనుకోవడం పట్ల సమాజ నాయకులు ఈ సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పథకం కింద మూడవ బిడ్డకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను నగదు బహుమానంతోపాటు బహిరంగ కార్యక్రమంలో సత్కరిస్తామని కూడా కేకేపీఎస్ ప్రకటించింది.