చెన్నై, మే 7: ఏ పార్టీకీ అధికారం చేపట్టే సంఖ్యలో మెజారిటీ సీట్లు రాకపోవడంతో తమిళనాడులో ముఖ్యమంత్రి పీఠంపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతున్న వేళ తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఏర్పాటులో విజయ్‌కు చెందిన టీవీకే పార్టీ కనుక విజయవంతమైతే ఆరు నెలల పాటు ఆయన పాలనను అడ్డుకోమని స్టాలిన్ గురువారం ప్రకటించారు.
రాష్ట్రంలో రాజకీయ అనిశ్చిత స్థితి నెలకొనాలని, మరోసారి ఎన్నికలు జరుగాలని డీఎంకే కోరుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. టీవీకే ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంతో పాటు, తాము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగించాలని తాము కోరుతున్నామన్నారు.
మీ పథకాల్లో ఏది ముఖ్యమైనదని భావిస్తున్నారన్న ప్రశ్నకు తాము ప్రవేశపెట్టిన పాఠశాల విద్యార్థుల ఉచిత బ్రేక్‌ఫాస్ట్ పథకం చాలా ప్రాధాన్యత గలదిగా భావిస్తున్నామని, అలాగే మహిళల ఖర్చుల కోసం నెలకు రూ.1,000 సహాయం అందించే పథకం కూడా ముఖ్యమైనదేనని అన్నారు.
మహిళలకు రూ. 2,500 ఆర్థిక సహాయం చేస్తామని విజయ్ ఇచ్చిన హామీ అమలు సాధ్యాసాధ్యాల గురించి ఆయన ప్రస్తావిస్తూ కనీసం తాము ఇచ్చిన విధంగా రూ. 1,000 అందించినా చాలునని పేర్కొన్నారు. 2021 ఎన్నికల్లో తాము చేసిన వాగ్దానాల్లో 90 శాతం అమలు చేశామన్నారు. కేంద్రం పరిధిలో ఉన్నందున నీట్‌ను రద్దు చేస్తామన్న హామీని అమలు చేయలేకపోయామని తెలిపారు.