Umar Khalid : ఢిల్లీ అల్లర్ల కేసు నిందితులు ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌కు కోర్టులో మరోసారి షాక్ తగిలింది. ఇద్దరికీ బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో ఇద్దరూ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. బుధవారం కోర్టు డిస్మిస్ చేసింది. ఈ అంశంలో ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని దృష్టిలో ఉంచుకుని బెయిల్ ఇవ్వలేమని కోర్టు తెలిపింది.
ఖలీద్, ఇమామ్ ఇద్దరికి ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించడం ఇది మూడోసారి. జస్టిస్ ప్రతిభా ఎం సింగ్, జస్టిస్ దినేష్ భట్‌తో కూడిన ధర్మాసనం బెయిల్‌పై నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో గత జనవరి 5న సుప్రీంకోర్టు నిందితులకు బెయిల్ నిరాకరించింది. అయితే, అందరు సాక్షుల విచారణ పూర్తి అయిన తర్వాత లేదా ఏడాది తర్వాత.. రెండింటిలో ఏది ముందైతే దానికి అనుగుణంగా బెయిల్ కోసం మంజూరు చేసుకోవాలని సూచించింది.
ఇద్దరిపై దేశంలో అత్యంత కీలకమైన ఉపా చట్టం కింద కేసు నమోదైందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలివి. కేంద్రం తీసుకొచ్చిన సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో ఫిబ్రవరి 2020లో ఆందోళన జరిగింది. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ సమయంలో 53 మంది మరణించారు. 700 మంది గాయపడ్డారు. తీవ్ర ఆస్తి నష్టం కూడా జరిగింది. అత్యంత హింసాత్మకంగా జరిగిన ఈ ఆందోళనకు ప్రధాన కారకులుగా ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్ సహా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆప్ మాజీ నేత ఖలిద్ సైఫి, తాహిర్ హుస్సేన్ సహా పలువురిని అరెస్టు చేశారు. ఖలిద్‌ను సెప్టెంబర్ 13, 2020న అరెస్టు చేశారు. అప్పటినుంచి అతడు జైలులోనే ఉన్నాడు. గత జూలై 4న కూడా కోర్టు అతడికి బెయిల్ నిరాకరించింది.