ఇద్దరు పిల్లల నిబంధనకు కాలం చెల్లింది!
ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారిని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించే చట్టాల కొనసాగింపును సుప్రీంకోర్టు బుధవారం ప్రశ్నించింది.
- ఆ రూల్‌తో దేశానికే నష్టం
- 2003 నాటి తీర్పు విస్తృత ధర్మాసనానికి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, నవంబర్ 4: ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారిని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించే చట్టాల కొనసాగింపును సుప్రీంకోర్టు బుధవారం ప్రశ్నించింది. దేశంలో తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు, మారుతున్న జనాభా గణాంకాలు అటువంటి ఆంక్షల వెనుక ఉన్న హేతుబద్ధతను బలహీనపరిచాయని న్యాయస్థానం పేర్కొంది. జావేద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా కేసులోని 2003 నాటి తీర్పును జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ ఆరాధేలతో కూడిన ధర్మాసనం విస్తృత ధర్మాసనానికి నివేదించింది. భారతదేశంలో తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు దృష్ట్యా ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వ్యక్తులను ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా చేసే చట్టాలను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది.
కాకోడ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ మంగళ భీమ్రావుకు సంబంధించి ఆమెకు మూడవ సంతానం జన్మించిన నేపథ్యంలో మహారాష్ట్ర గ్రామ పంచాయతీ చట్టం, 1969లో సెక్షన్ 14(1)(జే-1) కింద విధించిన అనర్హతను ధర్మాసనం కొట్టివేసింది. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వ్యక్తులు అటువంటి పదవులను చేపట్టకుండా నిషేధించే ఈ నిబంధన చట్టానికి చేసిన సవరణ ద్వారా 2000 సెప్టెంబర్ 13న అమల్లోకి వచ్చింది. భారతదేశపు మొత్తం సంతానోత్పత్తి రేటు(టీఎఫ్ఆర్) 2003లో 3గా ఉండగా ప్రస్తుతం అది 1.9కి పడిపోయిందని ధర్మాసనం పేర్కొంది. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లల్ని కనడాన్ని శిక్షించే చట్టాలు వాటి ప్రాసంగికతను కోల్పోయాయని మేము గట్టిగా అభిప్రాయపడుతున్నాము.
అటువంటి చట్టాలకు పునాది అయిన అధిక జనాభా భయం, గత కొన్ని దశాబ్దాలుగా వచ్చిన జనాభా మార్పుల కారణంగా కూలిపోయింది. 2003లో జావేద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా కేసులో అటువంటి చట్టాలను సమర్థించినప్పటి నుంచి భారతదేశ మొత్తం సంతానోత్పత్తి రేటు 3 నుంచి 1.9కి ఎలా పడిపోయిందో మేము వివరించాము అని జస్టిస్ నరసింహ పేర్కొన్నారు. జనాభా పెరుగుదలను నియంత్రించే చట్టాలు తమ ప్రాసంగికతను కోల్పోయాయని, జనాభా మార్పులను మనం గమనించకపోతే దేశం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని ధర్మాసనం పేర్కొంది. ఈ కారణంగానే తాము విచారణను నిలిపివేసి విస్తృత ధర్మాసనానికి దీన్ని నివేదించామని జస్టిస్ నరసింహ పేర్కొన్నారు.
రాంగ్ నంబర్ డయల్ చేస్తున్నారు!
పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల్లో షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలకు(ఎస్టీ) రిజర్వ్ చేసిన నియోజకవర్గాలను నిర్దిష్ట కాలవ్యవధిలో మారుస్తూ ఉండాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ అంశం పార్లమెంట్ పరిధిలోనిదని, న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేయలేవని స్పష్టంచేసింది. ‘మీరు రాంగ్ నంబర్‌కు ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు నిరసనలు, నినాదాల కాలం నడుస్తున్నది.
మీరూ ఆ మార్గాన్ని అనుసరించవచ్చు’ అని సరదాగా వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ జిల్లాకు చెందని జగదీశ్ సింగ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో అమలవుతున్న తరహాలో అసెంబ్లీ, పార్లమెంట్ రిజర్వ్డ్ స్థానాలకూ రొటేషన్ విధానం తీసుకురావాలని కోరారు. ప్రస్తుత విధానం రాజ్యాంగంలోని 14,15,19 అధికరణాలు కల్పించిన హక్కులకు విరుద్ధమని, ఓటర్లకు అభ్యర్థుల ఎంపికలో పరిమితులు విధిస్తున్నదని పిటిషన్లో పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

