న్యూఢిల్లీ, జూన్ 9: ప్రపంచవ్యాప్తంగా జననాల రేట్లు తగ్గుతుండగా.. ఇందుకు ఐఫోన్ కారణం కావచ్చని పలు నూతన అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఐఫోన్‌ను ఆవిష్కరించిన 2007 సంవత్సరం తరువాత ప్రపంచవ్యాప్తంగా పేద, ధనిక దేశాలు అన్న తేడా లేకుండా జననాల రేట్లు తగ్గుముఖం పట్టడం ప్రారంభమైందని ఓ పరిశోధన వెల్లడించింది. చారిత్రకంగా, ఏదైనా ప్రాంతంలో లేదా సొసైటీలో జీవన ప్రమాణాలు మెరుగుపడినప్పుడు జననాల రేటు పడిపోతుంటుంది. కానీ గత రెండు దశాబ్దాల్లో పరిశోధకులు ఓ కొత్త పరిణామం చోటుచేసుకోవడం చూశామని అంటున్నారు. ఆయా ప్రదేశాల్లో విభిన్నమైన సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ 2007 నుంచి అంతటా జననాల రేట్లు తగ్గుతున్నట్టు వెల్లడైంది.
ఎందుకిలా జరిగింది? అని పరిశోధించినప్పుడు, ఇందుకు ఐఫోన్ కారణం కావచ్చని ఇటీవల జరిగిన రెండు అధ్యయనాలు వెల్లడించాయి. అమెరికాలో 1980 నుంచి 2007 మధ్యకాలంలో 1000 మంది మహిళల్లో సంతానోత్పత్తి రేటు 65 నుంచి 70 మధ్య ఉండేది. ఆ తరువాత కాలంలో ఆ రేటు క్రమంగా తగ్గుతూ వచ్చింది. 2024 నాటికి అది 54కు అనగా 17 ఏండ్ల కాలంలో 22 శాతం తగ్గిందని నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనమిక్ రిసెర్చ్ అధ్యయన నివేదిక వెల్లడించింది. అయితే తగ్గుతున్న జననాల రేటుకు ఐఫోన్ ఎలా కారణమవుతుందన్నది సంక్లిష్టమైన అంశం.
అమెరికాలో 2007 జూన్‌లో ఐఫోన్‌ను ఆవిష్కరించారు. అప్పటి నుంచి 2011 వరకు ఏటీ&టీ నెట్వర్క్ ద్వారా మాత్రమే ఐఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉండేది. ఈ నెట్వర్క్ అందుబాటులో లేని కౌంటీల (గ్రామీణ ప్రాంతాలు)లో జననాల రేటు సాధారణంగా ఉన్నట్టు వెల్లడైంది. ఇక నెట్వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో 15 నుంచి 19 ఏండ్ల మధ్య మహిళల్లో జననాల రేటు 4.5 నుంచి 8 శాతం, 20 నుంచి 24 ఏండ్ల మధ్య మహిళల్లో 3.2 నుంచి 6 శాతం తగ్గినట్టు వెల్లడైంది. ఈ అంచనాలను క్రోడీకరించినప్పుడు.. 2007-2011 మధ్య కాలంలో 15 నుంచి 44 ఏండ్ల మధ్య మహిళల్లో సంతానోత్పత్తి రేటు 33 నుంచి 52 శాతం పడిపోయినట్టు పరిశోధకులు పేర్కొన్నారు. ఇక 2007 నుంచి 2024 మధ్య కాలంలో 15-19 ఏండ్ల మధ్య వారిలో జననాల రేటు 70 శాతం, 20-24 ఏండ్ల మధ్య వారిలో 47 శాతం, 30-34 ఏండ్ల మధ్య వారిలో 7 శాతం పడిపోయినట్టు గుర్తించారు.
జననాల రేటు తగ్గడానికి ఐఫోన్ ఒక్కటే కారణం కాకపోయినా, దాని పాత్ర ప్రధానమైనదని పరిశోధకులు పేర్కొన్నారు. ఐఫోన్‌తోపాటు ఇతర స్మార్ట్ఫోన్లు వినియోగంలోకి వచ్చిన తరువాత ప్రజలు భౌతిక ప్రపంచంతో, స్నేహితులతో తక్కువ సమయం గడుపుతున్నారని తెలిపారు. దీంతో లైంగిక చర్యల సంఖ్య తగ్గిపోయి.. చాలామంది అశ్లీల చిత్రాల వైపు ఆకర్షితులయ్యారని పేర్కొన్నారు. సిన్సినాటి యూనివర్సిటీకి చెందిన ఆర్థికవేత్తలు ప్రపంచబ్యాంకు డాటాను ఉపయోగించి 128 దేశాల్లో స్మార్ట్‌ఫోన్ ప్రభావం, యువతలో సంతానోత్పత్తి రేటుపై మరో అధ్యయనం చేశారు. ఆయా దేశాల్లో భిన్నమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు, సంక్షేమ కార్యక్రమాలు, గర్భస్రావ నిరోధక చట్టాలు, మత సంప్రదాయాలు, ద్రవ్యోల్బణం ప్రభావం వేర్వేరుగా ఉన్నప్పటికీ సంతానోత్పత్తి రేటు తగ్గడాన్ని వారు గమనించారు.
ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో 2007 తరువాత ఈ పరిణామం చోటుచేసుకున్నదని పరిశోధకులు పేర్కొన్నారు. ఇందుకు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన ‘సాంకేతిక పరికరమే’ కారణంగా భావిస్తున్నామని తెలిపారు. ఇరాన్, కోస్టారికా, గ్వాటమాల, చిలీ, మెక్సికో, తుర్కియే వంటి దేశాల్లో స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చిన వెంటనే టీనేజర్లలో సంతానోత్పత్తి రేటు గణనీయంగా పడిపోవడం ప్రారంభమైనట్టు గుర్తించారు. 4జీ వంటి బ్రాడ్‌బ్యాండ్ హైస్పీడ్ నెట్వర్క్ ఉన్న దేశాల్లో టీనేజర్లలో సంతానోత్పత్తి అంతే వేగంగా తగ్గినట్టు తెలిపారు. వ్యక్తులు ప్రత్యక్షంగా కలుసుకోవడం, సంభాషించడం వంటి సామాజిక చర్యలు 2003లో కనీసం 68 నిమిషాలు ఉండగా, అది 2019 నాటికి 38 నిమిషాలకు తగ్గిపోయినట్టు ఆ అధ్యయనం గుర్తించింది.