న్యూఢిల్లీ : మనం వెళ్లాలనుకుంటున్న చిరునామాకు సంబంధించి వర్చువల్ రియాల్టీ అనుభూతితో దారి చూపే విధంగా గూగుల్ మ్యాప్స్‌లో సరికొత్త ఆప్షన్ త్వరలో రాబోతున్నది. రోడ్డుపై నడుస్తున్న ప్రత్యక్ష అనుభూతిని కలిగించే విధంగా భవనాలు, రోడ్డు మార్గాలు కనపడటం ఇందులో ప్రత్యేకత. భారత్‌లో 3 వేల నగరాల్లో ‘అడ్రస్ డిస్క్రిప్టర్’ సేవలు అందుబాటులోకి వస్తాయని గూగుల్ మ్యాప్స్ వైస్ ప్రెసిడెంట్ మిరాయం డానియెల్ ప్రకటించారు. ‘గమ్యాన్ని చక్కగా అవగాహన చేసుకోవటంలో అడ్రస్ డిస్క్రిప్టర్ అద్భుతంగా పని చేస్తుంది’ అని డానియెల్ వివరించారు. నావిగేషన్‌ను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంటుందన్నారు.