న్యూఢిల్లీ: ఒక మోడల్ ఆమె ఇంట్లో కత్తిపోట్లకు గురైంది. ఆసుపత్రికి తరలించగా ఆమె మరణించింది. ఈ నేపథ్యంలో ఆ యువతి జిమ్ ట్రైనర్ ఆమెను కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం వెతుకుతున్నారు. (Model Stabbed To Death) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. 21 ఏళ్ల ముస్కాన్ చదువుకుంటూ మోడలింగ్ చేస్తున్నది. పశ్చిమ ఢిల్లీలోని తిలక్ నగర్లో ఉన్న ఒక బిల్డింగ్‌లో ఆమె నివసిస్తున్నది.
కాగా, బుధవారం ముస్కాన్ అరుపులు విన్న పొరుగువారు ఆమె ఇంటికి చేరుకున్నారు. కత్తిపోటు గాయాలతో ఆమె పడి ఉండటం చూసి షాక్ అయ్యారు. ముస్కాన్‌ను ఆసుపత్రికి తరలించగా ఆమె మరణించింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. ముస్కాన్ ఇంటితో పాటు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు.
మరోవైపు జిమ్ ట్రైనర్ ఇమ్రాన్ ఆ మోడల్‌పై కత్తితో దాడి చేసి పారిపోయినట్లు పోలీసులు తెలుసుకున్నారు. చాలా కాలంగా ముస్కాన్‌ను అతడు వేధిస్తున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం వెతుకుతున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. మోడల్ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.