Kolkata airport : పశ్చిమ బెంగాల్, కోల్‌కతాలోని ఎయిర్‌పోర్టుకు గురువారం బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో భద్రతా విభాగానికి చెందిన అధికారులు తనిఖీలు చేపట్టారు. అధికారులు అందించిన సమాచారం ప్రకారం.. కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు గురువారం మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. ఎయిర్‌పోర్టులో ఒక బాంబు పెట్టినట్లు ఆ మెయిల్ సారాంశం.
దీనిపై ఎయిర్‌పోర్టు అధికారుల నుంచి సమాచారం అందుకున్న భద్రతా దళాలు ఎయిర్‌పోర్టు పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు. ఎయిర్‌పోర్టు లోపల, బయట తనిఖీలు చేపట్టారు. గతంలో కూడా ఈ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తనిఖీల తర్వాత ఆ బెదిరింపులు ఉత్తుత్తివే అని తేలింది. గతంలో ఇలాంటి బెదిరింపులు ఉత్తుత్తివే అని తేలినప్పటికీ, ఇప్పుడు నిర్లక్ష్యం వహించకుండా అన్ని రకాలుగా తనిఖీ చేస్తున్నారు. నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా తనిఖీలు చేపట్టారు. ప్రయాణికులు, లగేజ్‌ను కూడా తనిఖీ చేస్తున్నారు. మరోవైపు ఈ మెయిల్ ఎవరు పంపారు.. ఎక్కడి నుంచి వచ్చింది వంటి వివరాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
అయితే, ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాల్ని అధికారులు ఇంకా వెల్లడించలేదు. గత ఫిబ్రవరి నుంచి కోల్‌కతా ఎయిర్‌పోర్టుకు పలు బెదిరింపులు వచ్చాయి. ఇంకోవైపు గుజరాత్, అహ్మదాబాద్‌లోని 10 ప్రైవేటు స్కూళ్లకు కూడా బుధవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఆయా స్కూళ్లకు చేరుకుని తనిఖీలు నిర్వహించారు. అయితే, ఎక్కడా బాంబులు లేవని తేల్చారు.