ముంబై: కార్యకలాపాలు నిలిపివేసిన పెట్రోల్ బంకును సీల్ చేసేందుకు ఇండియన్ ఆయిల్ కంపెనీకి చెందిన అధికారి తన బృందంతో అక్కడకు వెళ్లారు. ఈ సందర్భంగా బంకు యజమాని కుటుంబంతో వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో బంకు యజమాని కుమారుడు కత్తితో ఏడుసార్లు పొడిచి ఆ అధికారిని హత్య చేశాడు. (Indian Oil Official Stabbed) మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సాంకేతిక సమస్యల కారణంగా చోంధిలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ బంకును మూడు నెలలుగా మూసివేశారు. అక్టోబర్ 6న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్న మహేష్ షెల్కే తన బృందంతో కలిసి అక్కడకు వెళ్లారు. ఆ బంకును సీల్ చేసే విషయంలో ఆపరేటర్ సాహెబ్రావ్ పాండవీర్ కుటుంబం, ఆయన మధ్య వాగ్వాదం జరిగింది.
కాగా, పెట్రోల్ బంకు కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు ఒక నెల సమయం కోరగా ఇండియన్ ఆయిల్ అధికారులు నిరాకరించారు. దీంతో బంకు యజమాని కుటుంబం, మహేష్ షెల్కే మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో బంకు ఆపరేటర్ సాహెబ్రావ్ పాండవీర్ కుమారుడైన ఉమేష్ పాండవీర్, షెల్కేను కత్తితో ఏడుసార్లు పొడిచాడు. కడుపు, వీపు, ముఖంపై కత్తి గాయాలతో నేలపై కుప్పకూలిన ఆయన మరణించారు. అనంతరం నిందితులు రెండు కార్లలో అక్కడి నుంచి పారిపోయారు. ఈ సంఘటనపై కురుండ పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదైంది. నిందితుల కోసం పోలీసులు వెతుకుతున్నారు.
మరోవైపు తమ కంపెనీ అధికారిపై కత్తితో దాడి చేసి హత్య చేయడాన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ అర్విందర్ సింగ్ సాహ్నీ ఖండించారు. పోలీసులు నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కూడా ఈ హత్యను ఖండించారు. నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకునేలా మహారాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖలోని అత్యున్నత స్థాయి అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లు తెలిపారు. మహేష్ షెల్కే కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. పెట్రోలియం మంత్రిత్వ శాఖ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తరఫున వారికి అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.