న్యూఢిల్లీ: రక్షణ దళాల్లో థియేటర్ కమాండ్ (Theatre Command) వ్యవస్థను సరికొత్తగా రూపొందిస్తున్నారు. కొత్త తరహా థియేటర్ కమాండ్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు త్రివిధ దళాలు ప్లాన్ రెఢీ చేసినట్లు తెలిసింది. రక్షణ బలగాలు ఈ వ్యవస్థ కింద సరికొత్త రీతిలో తమ విధులను నిర్వర్తిస్తాయి. పశ్చిమ సరిహద్దుల్లో పాకిస్థాన్‌ను ఎదుర్కొనేందుకు వెస్ట్రన్ థియేటర్ ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ కమాండ్ భారతీయ వైమానిక దళం ఆధీనంలో ఉండనున్నది. ఇక ఉత్తర థియేటర్ కమాండ్.. చైనా సరిహద్దుల్ని పర్యవేక్షిస్తుంది. దీనికి ఆర్మీ ఆఫీసర్ నాయకత్వం వహించనున్నారు. ఇక మారిటైం థియేటర్ కమాండ్‌కు.. నేవీ ఆఫీసర్ నాయకత్వం వహించే రీతిలో ప్రస్తుతం ప్రణాళిక సిద్దమైంది.
త్రివిధదళాల మధ్య సమన్వయం కోసమే థియేటర్ కమాండ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఈ వ్యవస్థలకు రక్షణశాఖ, భద్రతా క్యాబినెట్ కమిటీ నుంచి ఆమోదం దక్కాల్సి ఉంటుంది. భౌగోళిక సరిహద్దులతో థియేటర్ కమాండ్ వ్యవస్థలు పనిచేస్తాయి. ప్రతి కమాండ్‌కు ఓ మిలిటరీ కమాండ్ నాయకత్వం వహిస్తారు. అయితే యుద్ధానికి కావాల్సిన అన్ని ఆయుధాలు అతని ఆధీనంలో ఉంటాయి. యుద్ధ పోరాట పరికరాలు, విమానాలు, హెలికాప్టర్లు, గన్నులు, యుద్ధ ట్యాంక్‌లు, సామాగ్రి, సైన్యం మొత్తం ఆ కమాండర్ ఆదేశాల పరిధిలోకి వస్తాయి.
అయితే కొత్త ప్లాన్ ప్రకారం.. వెస్ట్రన్ థియేటర్ కమాండ్‌కు పర్మనెంట్‌గా భారతీయ వైమానిక దళం నేతృత్వం వహించనున్నది. గత ఏడాది మే నెలలో పాకిస్థాన్‌పై జరిగిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఈ మార్పు చేశారు. థియేటర్ కమాండ్ల కేటాయింపు దాదాపు పూర్తి అయినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంట్లో రొటేషన్ విధానం పెద్దగా ఉండకపోవచ్చు అన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌కు డిప్యూటీ పోస్టును కూడా క్రియేట్ చేయాలన్న ఆలోచనలో మిలిటరీ ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని థియేటర్ కమాండ్లకు డిప్యూటీ కమాండర్లను ఏర్పాటు చేయాలని కూడా భావిస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ అనిల్ చౌహాన్ ఈ ఏడాది మేలో రిటైర్ కానున్నారు. అయితే ఆయన పదవీ విరమణ చేసే సమయంలోగా కొత్త తరహా థియేటర్ కమాండ్ ప్లానింగ్ అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి వివరించనున్నారు. అయితే భారతీయ వైమానిక దళానికి చెందిన అసెట్స్ అంశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది. ఐఏఎఫ్‌కు చెందిన కొన్ని అసెట్స్‌ను ఢిల్లీ నుంచి కంట్రోల్ చేసే ఆలోచనలో ఉన్నారు.