న్యూఢిల్లీ, అక్టోబర్ 7: ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)కు వ్యతిరేకంగా విపక్ష ఇండియా కూటమి చేపట్టిన ఆందోళన బుధవారం రెండవ రోజు కూడా ఢిల్లీలో కొనసాగింది. ఇండియా కూటమికి చెందిన ఇతర భాగస్వామ్య పక్షాలకు చెందిన నాయకులతో కలసి కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ జంతర్ మంతర్ వెళుతుండగా పోలీసులు అడ్డుకోవడంతో షాంగ్రిలా హోటల్ సమీపంలోని ఒక కూడలి వద్ద వారు బైఠాయించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని బలవంతంగా అక్కడి నుంచి తరలించారు.
రాహుల్‌తోపాటు ఇతర నాయకులను బారాఖంబా పోలీసు స్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన కార్యక్రమం కోసం జన్‌పథ్ వద్ద సమావేశమైన విపక్ష ఎంపీలు బస్సులు ఎక్కి నిర్ణీత నిరసన ప్రదేశం వైపు వెళుతుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు మేము నిరసనను ఆపే ప్రసక్తి లేదు. ఇది దేశంలోని అత్యంత పవిత్రమైన అంశాన్ని(ఓటు హక్కు) కాపాడుకోవడానికి చేస్తున్న పోరాటం.
నరేంద్ర మోదీ, అమిత్ షా ఏం చేసినా మమ్మల్ని ఆపలేరు అని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీ పోలీసులతో జరిగిన ఘర్షణ తర్వాత రాహుల్ గాంధీ, ఇతర విపక్ష నాయకులను అదుపులోకి తీసుకోవడం, పలువురు నిరసనకారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం వంటి ఘటనలు జరిగిన మరోసటి రోజున ఈ పరిణామం చోటుచేసుకుంది. ఓట్ చోరీ ఆరోపణలపై ఇండియా కూటమి తన ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేసింది. జ్ఞానేశ్‌కు వ్యతిరేకంగా తమ ఆందోళనను కొనసాగించే ఉద్దేశంతో రెస్టారెంట్ నుంచి సుమారు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న జంతర్ మంతర్ వైపు వెళ్లేందుకు ఎంపీలు బస్సుల్లో బయలుదేరారు.
జంతర్ మంతర్ వైపు ర్యాలీ నెమ్మదిగా సాగుతుండగా త్రివర్ణ పతాకాన్ని మోసుకెళుతున్న బస్సుల పైకప్పుల పైకి కొందరు ఎంపీలు ఎక్కడంతో అత్యంత కట్టుదిట్టమైన భద్రత గల ఆ ప్రాంతం వరుసగా రెండవ రోజు కూడా స్తంభించిపోయింది. అశోకా రోడ్-జంతర్ మంతర్ మార్గంలోని షాంగ్రిలా హోటల్ వెలుపల భద్రతా సిబ్బంది బారికేడ్లు ఏర్పాటు చేశారు. నిరసన ప్రదేశానికి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో బహుళ అంచెల భద్రతా వలయంతో బస్సులను నిలిపివేశారు. బారికేడ్ల కారణంగా తమ ప్రయాణం ఆగిపోవడంతో రాహుల్ గాంధీ, ప్రియాంక, ఖర్గే బస్సు దిగారు. జంతర్ మంతర్ వైపు ర్యాలీగా వెళ్లకుండా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో వారు ఆ కూడలి వద్ద రోడ్డుపైన బైఠాయించి నిరసన చేపట్టారు.
రాజ్యాంగ ప్రతిని చేతబూని ప్రియాంక రోడ్డుపైన పడుకున్నారు. పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్న భద్రతా సిబ్బంది రాహుల్ గాంధీని భుజాలపై మోసుకుని పోలీసు బస్సులోకి ఎక్కించి తరలించారు. కేజీ మార్గ్‌లో రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న బస్సు టైరును కాంగ్రెస్ కార్యకర్తలు పంక్చర్ చేశారు. అనంతరం మహిళా పోలీసుల బృందం అక్కడకు చేరుకుని రోడ్డుపై పడుకున్న ఉన్న ప్రియాంక గాంధీని, ఇతర మహిళా నాయకులను అక్కడి నుంచి తొలగించింది. వారిని బలవంతంగా అక్కడి నుంచి బస్సుల్లోకి ఎక్కించి తరలించారు. నిరసనకారుల్లో కాంగ్రెస్, టీఎంసీ, సీపీఎం, సీపీఐ, ఆర్జేడీ, ఇతర పార్టీల ఎంపీలు ఉండగా సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలు మాత్రం ఇందులో పాల్గొనలేదు.

Congress Activists Protest
మహిళా పోలీసులు నన్ను గోర్లతో రక్కారు
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయడానికి వెళుతున్న విపక్ష ఇండియా కూటమి ఎంపీలను బుధవారం సెంట్రల్ ఢిల్లీలో భారీ భద్రతా వలయం అడ్డుకోవడంతో హైడ్రామా చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు నాయకులను భద్రతా సిబ్బంది బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకుని నిరసన స్థలం నుంచి తరలించగా ప్రియాంక గాంధీ వాద్రా, ఇతర మహిళా ఎంపీలు జంతర్ మంతర్‌కు వెళ్లే రహదారిపై పడుకోవడంతో ఆమెను బలవంతంగా అక్కడ నుంచి తొలగించారు.
తనను అదుపులోకి తీసుకోవడానికి వచ్చిన మహిళా పోలీసులు తనను తోసి కింద పడేశారని, గోర్లతో రక్కారని ప్రియాంక గాంధీ ఆరోపించారు. కేవలం ఎన్నికల కమిషనర్‌ను కలవాలని కోరుతున్న ఎంపీల పట్ల వారు వ్యవహరించే తీరు ఇది. మమ్మల్ని వారు ఇలాగే చూసుకుంటున్నారు. ఎంపీలను కొడుతున్నారు. పోలీసులు నన్ను గట్టిగా పట్టుకుని గీతలు పడేలా గోర్లతో రక్కారు. మమ్మల్ని నేలమీద పడేశారు. ఇప్పుడు మేము ఇక్కడి నుంచి కదలబోము. వారి బలగాలను వెనక్కి రమ్మనమనండి. నేను మాత్రం ఇక్కడి నుంచి కదలను అని ప్రియాంక అన్నారు. అనంతరం, రోడ్డుపై పడుకుని ఉన్న ప్రియాంక గాంధీతోపాటు ఇతర మహిళా నాయకులను అక్కడి నుంచి తరలించడానికి మహిళా పోలీసుల బృందం రంగంలోకి దిగింది. వారిని బలవంతంగా అక్కడ నుంచి బస్సుల్లో ఎక్కించి, తరలించారు.