చెన్నై: తమిళనాడులోని ప్రభుత్వ ఆసుపత్రుల మందుల కవర్లపై హిందీ పదాలు ప్రింట్ చేయడంపై వివాదం చెలరేగింది. టీవీకే ప్రభుత్వంపై డీఎంకే విమర్శలు చేయగా ఆరోగ్య మంత్రి తిప్పికొట్టారు. గత ప్రభుత్వమే వీటిని ప్రవేశపెట్టిందని ఆరోపించారు. (Medicine Covers Row) కోయంబత్తూరు, కరూర్ ఆసుపత్రుల మందుల కవర్లపై హిందీ పదాలు ఉన్నట్లు డీఎంకే నేత, మాజీ మంత్రి టీఆర్బీ రాజా సోషల్ మీడియాలో ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఇప్పుడు ‘మూడు భాషల విధానం’ అమలు చేస్తున్నారా? అని టీవీకే ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.
కాగా, ఆరోగ్య మంత్రి కేజీ అరుణ్‌రాజ్ దీనిపై స్పందించారు. ఆ మందుల కవర్లను గత డీఎంకే ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టారని, ప్రస్తుత టీవీకే ప్రభుత్వం కేవలం వాటి వినియోగాన్ని కొనసాగిస్తున్నదని తెలిపారు. ‘డీఎంకే హయాంలో ప్రవేశపెట్టిన డిజైన్ లేదా భాషలో మేము ఎటువంటి మార్పులు చేయలేదు’ అని పేర్కొన్నారు. ఈ సమస్యపై డీఎంకే ‘మొసలి కన్నీరు’ కారుస్తోందని విమర్శించారు. ఆ పార్టీ ‘చౌకబారు రాజకీయాలు’ మానుకోవాలని ఆయన అన్నారు.
మరోవైపు ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిన వెంటనే, కరూర్, కోయంబత్తూరు రెండింటిలోనూ ఈ మందుల కవర్ల వినియోగాన్ని తక్షణమే నిలిపివేసినట్లు ఆరోగ్య మంత్రి కేజీ అరుణ్‌రాజ్ తెలిపారు. టీవీకే ప్రభుత్వం ద్విభాషా విధానానికి కట్టుబడి ఉందన్నారు. మందుల కవర్లపై సూచనలు కేవలం తమిళం, ఆంగ్లంలోనే ఉంటాయని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎటువంటి రాజీ పడదని ఆయన స్పష్టం చేశారు.