Parboiled Rice | న్యూఢిల్లీ, అక్టోబర్ 11: పారాబాయిల్డ్ బియ్యం ఎగుమతులపై విధించిన 20 శాతం లెవీని కేంద్రం పొడిగించనున్నట్టు తెలుస్తున్నది. పారాబాయిల్డ్ బియ్యం ఎగుమతులపై 20 శాతం లెవీని విధిస్తూ ఈ ఏడాది జూలైలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. అయితే ఈ ఆంక్షలు అక్టోబర్ 15తో ముగుస్తున్నాయి. దీంతో దేశీయంగా బియ్యం ధరలను అదుపు చేసే నెపంతో మరోసారి ఎగుమతులపై లెవీ అమలును పొడిగించాలని నిర్ణయం తీసుకున్నట్టు బ్లూమ్బర్గ్ సంస్థ వెల్లడించింది.
చక్కెర ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించనున్నట్టు తెలుస్తున్నది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని బ్లూమ్బర్గ్ వెల్లడించింది. భారత్ ఆంక్షలు విధించనున్న నేపథ్యంలో ఈ ఏడాది 2 మిలియన్ల టన్నులకు మించి ఎగుమతులు ఉండకపోవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో విదేశాల్లో చక్కెర ధరలకు రెక్కలొచ్చే అవకాశం ఉంది.