న్యూఢిల్లీ: ‘భారత్‌కు నిజమైన బాస్ అంబానీయా? స్టార్‌లింక్‌కు 165 దేశాల్లో లైసెన్స్ ఉంది. గత ఐదేండ్ల నుంచి భారత చట్టాలను, ఆ దేశ ప్రభుత్వం విధించిన ప్రతి నిబంధనను తు.చ. తప్పకుండా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అయినప్పటికీ ఇంకా మాకు ఎందుకు లైసెన్స్ ఇవ్వడం లేదు?’ అని ప్రముఖ టెక్ దిగ్గజం, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియాలోని పెట్టుబడిదారుల వ్యాపార ప్రయోజనాలు కాపాడేందుకు తమ స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
దీనిపై భారత ప్రభుత్వం, మస్క్ మధ్య గురువారం ఎక్స్ వేదికగా వాగ్వాదం జరింది. మస్క్ ఆరోపణలను టెలికాం విభాగం తిరస్కరించింది. దేశ శాటిలైట్ కమ్యూనికేషన్ నిబంధనలు అత్యంత పారదర్శకంగా, ఎవరిపట్ల వివక్ష లేకుండా సమానంగా అమలవుతున్నాయని స్పష్టం చేసింది. దేశంలో స్టార్‌లింక్ వాణిజ్య కార్యకలాపాల ప్రారంభానికి సన్నాహాలు చేసుకుంటున్న సమయంలో ఈ వివాదం తెరపైకి వచ్చింది. స్టార్‌లింక్ ఇప్పటికే మౌలిక వసతులను నిర్మించినప్పటికీ, ఇంకా అనుమతుల ప్రక్రియలోనే కొనసాగుతున్నది.
భారత్‌లో స్టార్‌లింక్ సేవల ఆవశ్యకతపై ‘ఎక్స్’లో వచ్చిన ఒక పోస్ట్‌కు ఎలాన్ మస్క్ స్పందిస్తూ ఈ ఆరోపణలు చేశారు. భారత ప్రజలపై తమ గుత్తాధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు కొందరు ప్రముఖ వ్యాపారవేత్తలు స్టార్‌లింక్‌ను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని, వారు ఎవరో అందరికీ తెలుసని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ చర్య భారత ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్న నేరమని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యల్లో ఆయన ఏ ఒక్కరి పేరును నేరుగా ప్రస్తావించలేదు.
మస్క్ చేసిన ఆరోపణలను కేంద సమాచార శాఖ తోసిపుచ్చింది. భారత్ స్టార్‌లింక్ పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్నదన్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది. టెలికం, శాటిలైట్ సేవల కోసం ప్రభుత్వం ఉమ్మడి అనుమతుల వ్యవస్థను అమలు చేస్తున్నదని తెలిపింది. నాన్ జియోసింక్రోనస్ ఆర్బిట్లలో మూడు సంస్థలకు ప్రభుత్వం లైసెన్సులు మంజూరు చేసిందని పేర్కొంది. వినియోగదారుల భద్రత, డాటా రక్షణపై ప్రభుత్వం విధించిన తప్పనిసరి భద్రతా ప్రమాణాలను అన్ని సంస్థలు పూర్తి చేయాలని తెలిపింది. లైసెన్స్ పొందిన మూడు సంస్థల భద్రతా మదింపులు పరిశీలన దశలోనే ఉన్నాయని తెలిపింది.