న్యూఢిల్లీ, అక్టోబర్ 8: క్యాన్సర్ చికిత్స కోసం ఉపయోగించే ఔషధాల ధరలు దాదాపు 70 శాతం వరకు తగ్గనున్నాయి. మొత్తం చికిత్స ఖర్చులో మందుల ధరలే ప్రధాన భాగంగా ఉండటంతో క్యాన్సర్ చికిత్స రోగులపై, వారి కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతున్నది. కొన్ని క్యాన్సర్ మందుల విషయంలో రిటైలర్ ధర(పీటీఆర్), గరిష్ఠ విక్రయ ధర(ఎంఆర్పీ) మధ్య ఉన్న భారీ వ్యత్యాసంపై ఇటీవల సుప్రీంకోర్టు ప్రశ్నించడంతో ఇది చర్చనీయాంశమైంది.
విచారణ సందర్భంగా రిటైలర్లు సుమారు రూ.2,700కు కొనుగోలు చేసిన ఒక క్యాన్సర్ మందుపై రూ.27,000 ఎంఆర్పీ ఉండటాన్ని కోర్టు ఒక ఉదాహరణగా ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో క్యాన్సర్ మందులను మరింత సరసమైన ధరలకు అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్రం ఇప్పుడు చర్యలు చేపట్టింది. షెడ్యూల్ చేయని అన్ని క్యాన్సర్ నిరోధక మందులపై ట్రేడ్ మార్జిన్లను ఎంఆర్పీపై 30 శాతానికి పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ కొత్త చర్య వల్ల కొన్ని రకాల క్యాన్సర్ మందుల ఎంఆర్పీ 70 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. రోగులకు ఏటా సుమారు రూ.2,500 కోట్ల మేర ఆదా అవుతుంది.