లక్నో, జూన్ 8: యూపీ రాజధాని లక్నోలో ఘోరం జరిగింది. పట్టపగలు ఒక బాలుడు 14 ఏండ్ల బాలిక ఇంట్లోకి చొరబడి ఆమెపై లైంగిక దాడి చేశాడు. అనంతరం ఆమెను సుత్తితో కొట్టి చంపి, ఫ్యానుకు వేలాడదీశాడు. గురువారం ఇందిరా నగర్లో జరిగిన ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
మృతురాలి తండ్రి కథనం ప్రకారం బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఘటన జరిగిన కాసేపటికి బాధితురాలి తల్లి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అక్కడే వరండాలో ఉన్న నిందితుడు ఆమెను పక్కకు తోసి పారిపోయాడు. బాలిక మృత దేహాన్ని శవ పరీక్షకు పంపించారు. లైంగిక దాడి, హత్యకు గల కారణాలు; మృతురాలితో నిందితుడికి ఉన్న సంబంధాన్ని దర్యాప్తులో తేలుస్తామని పోలీసులు వెల్లడించారు. నిందితుడి పేరు, ఇతర వివరాలు సేకరించామని వారు తెలిపారు.