పాట్నా: ఒక ప్రభుత్వ స్కూల్ బిల్డింగ్ మెట్లు కూలాయి. ఆ సమయంలో మెట్లపై ఉన్న కొందరు విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకున్నారు. వారిని వెలికి తీయగా ఒక బాలిక మరణించింది. మరో ముగ్గురు పిల్లలు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. (school staircase collapses) బీహార్లోని ఖగారియా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం అమ్నీ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం మెట్లు అకస్మాత్తుగా కూలిపోయాయి. పలువురు విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకున్నారు. వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.
కాగా, ఈ సంఘటనలో తీవ్రంగా గాయడిన విద్యార్థిని అయిన 9 ఏళ్ల రితికా కుమారి చికిత్స పొందుతూ మరణించింది. గాయపడిన మిగతా ముగ్గురు పిల్లలకు చికిత్స అందిస్తున్నారు. ఇది తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు పరుగున ఆ స్కూల్ వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ గందరగోళం నెలకొన్నది.
మరోవైపు ఈ సమాచారం అందుకున్న సదర్ సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ ధనంజయ్ కుమార్, పోలీసులు, ఇతర అధికారులతో కలిసి ఆ స్కూల్ వద్దకు చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని సమీక్షించారు. అయితే మెట్లు కూలిన ప్రభుత్వ స్కూల్ భవనం భద్రతపై తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.