CEC Gyanesh Kumar : సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు ఆందోళన ఉధృతం చేస్తుంటే.. 42 మంది జడ్జీలు సీఈసీకి మద్దతుగా నిలిచారు. ఎన్నికల సంఘాన్ని, రాజ్యాంగ వ్యవస్థల్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు విమర్శించారు. ఈ మేరకు 42 మంది మాజీ జడ్జీలు గురువారం బహిరంగ లేఖ రాశారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ ఇండియా బ్లాక్ ఎంపీలు ఢిల్లీలో నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, సీజేపీ నేతలు సహా పలువురు నిరసనలు చేపట్టారు.
ఈ అంశంపై మాజీ జడ్జీలు లేఖలో ప్రస్తావించారు. సరైన ఆధారాలు లేకుండా వోట్ చోరీ అంటూ విమర్శలు చేస్తున్నారని లేఖలో విమర్శించారు. ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ వ్యవస్థల్ని దొంగలు, రాజీపడ్డారు అంటూ ముద్ర వేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు తగిన ఆధారాలుంటే సంబంధిత వ్యవస్థలకు అందించాలని సూచించారు. వారి ఆరోపణలు న్యాయ వ్యవస్థతోపాటు చట్టబద్ధమైన వ్యవస్థలపై దాడి చేయడమే అని విమర్శించారు. భారత రాజ్యాంగ వ్యవస్థలపై నిరంతరం దాడులు జరుగుతున్నాయని, ఈ సారి ఎన్నికల సంఘంపై దాడి జరుగుతోందని, ఇలాంటి సమయంలో తాము మౌనంగా ఉండలేమని లేఖలో పేర్కొన్నారు.
అందువల్లే తాము లేఖ రాయాల్సి వచ్చిందని మాజీ జడ్జీలు స్పష్టం చేశారు. అత్యంత ఉన్నతమైన వ్యవస్థలపై ఈ దాడి జరుగుతోందన్నారు. ఈ విషయంలో తమ ఆందోళన చాలా తీవ్రమైందని వివరించారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ప్రక్రియను కూడా జడ్జీలు సమర్ధించారు. ఇది చట్టబద్ధంగా ఏర్పాటైన విధానం అన్నారు. వోట్ చోరీ గురించి ప్రెస్ కాన్ఫరెన్స్‌లలో చెబుతున్నారు తప్ప కోర్టులలో చెప్పలేకపోతున్నారని లేఖలో ప్రస్తావించారు. లేఖ రాసిన వారిలో సుప్రీంకోర్టు మాజీ జడ్జీలు, హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తులు ఉన్నారు. మాజీ జస్టిస్‌లు హేమంత్ గుప్తా, జస్టిస్ పంకజ్ మిట్టల్ వంటి ప్రముఖులు ఉన్నారు.