న్యూఢిల్లీ : ఈ ఏడాది ప్రారంభంలో సీబీఎస్ఈ ప్రవేశ పెట్టిన ఆన్ స్క్రీన్ మార్కింగ్ పోర్టల్‌లోని లోపాలను బయటపెట్టి ఎంతో పేరు తెచ్చుకున్న 19 ఏండ్ల నిసర్గ అధికారి మరో ఘనత సాధించాడు. అమెరికా న్యాయ విభాగానికి చెందిన హాల్ ఆఫ్ ఫేమ్‌లో అతని పేరును చేర్చారు. దీనిపై నిసర్గ స్పందించాడు. వారం రోజుల క్రితం యూఎస్ డిపార్టుమెంట్ ఆఫ్ జస్టిస్ సిస్టమ్ లో సైబర్ సైక్యూరిటీకి సంబంధించిన ఒక పెద్ద లోపాన్ని కనుగొన్నానని, దాన్ని సంబంధిత అధికారులకు తెలియజేసిన వెంటనే వారు దాన్ని సరిచేస్తున్నారని తెలిపాడు.
తన సహాయన్ని గుర్తించి వారు ఇలా తన పేరును చేర్చారని వెల్లడించాడు. యూఎస్ డిపార్టుమెంట్ ఆఫ్ డిఫెన్స్, యూఎస్ మిలిటరీ సిస్టమ్స్ లో కూడా లోపాలను కనుగొన్నానని, వాటిని సదరు అధికారులకు తెలియజేయగా సరిచేస్తున్నారని నిసర్గ పేర్కొన్నాడు. నిసర్గ ఆరేండ్ల వయసు నుంచే కోడింగ్ నేర్చుకున్నాడు. టీనేజ్లోనే ప్రముఖ సంస్థల పోర్టల్‌లకు చెందిన సైబర్ సెక్యూరిటీ లోపాలను కనుగొంటూ సంచలనాలు సృష్టిస్తున్నాడు.