– ఎంజీయూ రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి
– రాష్ట్ర ఉత్తమ టీచర్ ఎడ్యుకేటర్ అవార్డు గ్రహీత బొళ్ల నారాయణరెడ్డికి ఘన సన్మానం
రామగిరి, అక్టోబర్ 06 : విద్యారంగంలో, ముఖ్యంగా ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో టీచర్ ఎడ్యుకేటర్‌గా పనిచేస్తూ విశిష్ట సేవలందించిన బొళ్ల నారాయణరెడ్డికి లభించిన రాష్ట్ర ఉత్తమ టీచర్ ఎడ్యుకేటర్ అవార్డు ఆయన సేవలకు దక్కిన గుర్తింపు అని మహాత్మాగాంధీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి అన్నారు. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 2న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో డీవీఎం విద్యాశిక్షణ కళాశాల సీనియర్ టీచర్ ఎడ్యుకేటర్ బొళ్ల నారాయణరెడ్డి రాష్ట్రస్థాయి ఉత్తమ టీచర్ ఎడ్యుకేటర్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మంగళవారం ఎంజీయూలో సైకాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అభినందన, సన్మానోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
ఎంజీయూ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణప్రియ మాట్లాడుతూ.. టీచర్ ఎడ్యుకేటర్లు అందించే శిక్షణ, విద్యతోనే భవిష్యత్ ఉపాధ్యాయులు రూపుదిద్దుకుంటారని తెలిపారు. నారాయణరెడ్డి వంటి అధ్యాపకులను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. అవార్డు గ్రహీత మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి ఉత్తమ టీచర్ ఎడ్యుకేటర్ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్‌లోనూ విద్యార్థుల అభ్యున్నతికి మరింత అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. అనంతరం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కొప్పుల అంజిరెడ్డితో పాటు అధ్యాపకులు, విద్యార్థులు నారాయణరెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించారు. పుష్పగుచ్ఛాలు, జ్ఞాపిక అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంజీయూ సైకాలజీ డిపార్ట్మెంట్ అధ్యాపకులు డా.అరవింద్, నసేహా తందిర్, బి.చక్రి, డీవీఎం కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ బొడ్డుపల్లి రామకృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు.