నల్లగొండ : నాగార్జునసాగర్ విజయపురి హిల్ కాలనీ, పైలాన్ కాలనీలో నాగార్జునసాగర్ విజయపురి నార్త్ పోలీస్ ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించింది. అలాగే ప్రముఖ చారిత్రాత్మకమైన నాగార్జునసాగర్ ప్రదేశాలను సందర్శించారు. అక్కడి స్థానికులతో మాట్లాడి సాగర్ విశేషాలను తెలుసుకున్నారు.
అలాగే జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ లను సందర్శించి అక్కడి పోలీస్ సిబ్బందికి విధులలో భాగంగా వారు ఉపయోగించే స్వీయరక్షణ పరికరాలు, అధునాతన ఆయుధాల ప్రాముఖ్యత, వాటి పనితీరు గురించి అక్కడి సిబ్బందికి పరిచయం చేశారు. విజయపురి నార్త్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గౌరీ నాయుడు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నరసింహారావు ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా సామరస్యాన్ని పెంపొందించేందుకు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎప్పుడైనా, ఏవైనా వివాస్పదమైన ఘటనలు చోటుచేసుకున్నప్పుడు వెంటనే స్పందించి చర్యలు తీసుకునేందుకు అనువుగా రాపిడ్ యాక్షన్ఫోర్స్ (ఆర్ ఏఎఫ్) దళాలు కవాతు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ కమాండెంట్ కెపి సుధ, డిప్యూటీ కమాండర్ ఇన్స్పెక్టర్ రామ్ నివాస్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.