నల్లగొండ రూరల్, మార్చి 8 : నల్లగొండ పట్టణానికి చెందిన పలువురు విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణిస్తున్నారు. పట్టణంలోని గొల్లగూడకు చెందిన రావుల గణేశ్, సింగం మధు, కుంచెం హేమాద్రి హాకీలో ప్రతిభ కనబరుస్తూ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరితోపాటు యాదాద్రి భువనగిరి జిల్లాలోని లప్పనాయక్తండాకు చెందిన ధరావత్ శంకర్ సైతం స్టాండ్‌బైగా ఎంపికయ్యాడు. ఇటీవల రంగారెడ్డి జిల్లాలోని నందిగామలో జరిగిన సబ్ జూనియర్స్ రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపికయ్యారు.
ఇటీవల ఖేలో ఇండియాలో భాగంగా నల్లగొండ జిల్లాకు హాకీ శిక్షణ కేంద్రం కేటాయించారు. ఖేలో ఇండియా, నల్లగొండ హాకీ అసోసియేషన్ నేతృత్వంలో రోజూ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో ఉదయం, సాయంత్రం 60 నుంచి 70 మందికి హాకీలో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ కోసం ఖేలో ఇండియా ప్రత్యేక శిక్షకుడిని కేటాయించింది. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన నలుగురు క్రీడాకారులు ఏప్రిల్ 12 నుంచి 24 వరకు ఒడిశా రాష్ట్రంలోని రూర్కేలాలో జరుగనున్న జాతీయ స్థాయి సబ్ జూనియర్స్ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నారు.
భారత జట్టులో ఆడడమే లక్ష్యం
మాది నిరుపేద కుటుంబం. మా అమ్మ, నాన్న కూలి చేస్తూ నన్ను చదివిస్తున్నారు. నాకు హాకీ క్రీడపై ఆసక్తి ఉండడంతో నన్ను ప్రోత్సహించారు. దీంతో 5వ తరగతి నుంచే అవుట్డోర్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నా. ప్రస్తుతం నల్లగొండలోని అల్ఫా జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదవుతూ వనపర్తిలోని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థకు ఎంపికై హాకీలో శిక్షణ పొందుతున్నా. గతంలోనూ రెండుసార్లు జాతీయ స్థాయి హాకీ పోటీలకు ఎంపికై ఆడాను. ఈసారి ఎలాగైనా జాతీయ స్థాయి పోటీల్లో రాణించి భారత జట్టు తరఫున ఆడాలన్నదే లక్ష్యం.
– రావుల గణేశ్, గొల్లగూడ, నల్లగొండ
నిత్యం కఠోర సాధనతోనే ఎంపికయ్యా
ఖేలో ఇండియలో భాగంగా నల్లగొండ జిల్లాకు హాకీ శిక్షణ కేంద్రం రావడంతో హాకీలో ఉచిత శిక్షణ అందిస్తున్నారు. ఈ శిక్షణ ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటలు ఇస్తున్నారు. దీంతో కఠోర సాధన చేస్తున్నా. దీనికి తోడు కోచ్ సలహాలు, సూచనలతో సబ్ జూనియర్స్ జాతీయ స్థాయికి ఎంపికయ్యా. ప్రస్తుతం రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థకు ఎంపికై హాకీ శిక్షణ పొందుతున్నా. అల్ఫా జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నా. గతంలో ఎన్నోసార్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నా. మొదటిసారిగా జాతీయ స్థాయిలో ఆడబోతున్నా.
-సింగం మధు, గొల్లగూడ, నల్లగొండ
గ్రామీణ క్రీడాకారులను తీర్చిదిద్దడమే లక్ష్యం
సబ్ జూనియర్స్ విభాగంలో జాతీయ స్థాయి హాకీ క్రీడలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి నలుగురు క్రీడకారులు ఎంపికవడం సంతోషకరం. నల్లగొండలోని గొల్లగూడకు చెందిన ముగ్గురు క్రీడాకారులు గణేశ్, మధు, హేమాద్రి నిరుపేద కుటుంబాలకు చెందినవారు. అయినా వీరు ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపిస్తున్నారు. హాకీ అసోసియేషన్, ఖేలో ఇండియా ఆధ్వర్యంలో హాకీ క్రీడాకారులకు సహాయ సహకారాలు అందిస్తున్నాం. వీరు జాతీయస్థాయిలో రాణించి నల్లగొండ జిల్లాకు పేరు తేవాలని ఆకాంక్షిస్తున్నా.
– ఇమాం కరీం, హాకీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి, నల్లగొండ
జాతీయ పోటీలకు ఎంపిక సంతోషంగా ఉంది
హాకీ క్రీడపై ఆసక్తితో ఆరేండ్లుగా మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నా. హాకీ అసోసియేషన్, ఖేలో ఇండియా ఆధ్వర్యంలో హాకీలో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే ఆరు సార్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నా. మొదటిసారిగా జాతీయ స్థాయి హాకీ పోటీలో పాల్గొనబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
– కుంచెం హేమాద్రి, గొల్లగూడ, నల్లగొండ
క్రీడాకారులకు ఎమ్మెల్యే కంచర్ల సత్కారం
జాతీయ స్థాయి సబ్ జూనియర్స్ పోటీలకు ఎంపికైన హాకీ క్రీడాకారులను ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి బుధవారం తన నివాసంలో శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా హాకీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఇమాం కరీం, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దేప వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.