సూర్యాపేట, జూలై 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమంలో 14 ఏండ్లపాటు కేసీఆర్ వెన్నంటి ఉండి పోరాడి సాధించిన ప్రత్యేక రాష్ట్రంలో విద్యుత్ శాఖ మంత్రిగా రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ అందించి అమావాస్య చీకట్లను పారదోలడంతో పాటు వేల కోట్ల రూ పాయలతో ఉమ్మడి నల్లగొండ జిల్లా రూపురేఖలు మార్చిన సూర్యాపేట జిల్లా ప్రదాత మాజీ మంత్రి, సూ ర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి జన్మదినోత్సవాన్ని శనివారం భారీ ఎత్తున నిర్వహించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ నాయకులు నేడు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు రూపకల్పన చేశారు.
తమ అభిమాన నాయకుడి జన్మదినాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు సంసిద్ధులయ్యారు. మాజీ మంత్రి, హ్యాట్రిక్ ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నేడు ఉదయం 8 గంటలకు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రవంతి శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో కొత్తబస్టాండ్ ైప్లె ఓవర్ వద్ద అల్పాహారం, పండ్ల పంపిణీ చేయనున్నారు. ఉదయం 8.20 గంటలకు కల్లెపల్లి మహేశ్వరి దశరథ ఆధ్వర్యంలో వాణిజ్యభవన్ సెంటర్లో అల్పాహారం, 8.30 గంటలకు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
బీఆర్ఎస్ జిల్లా నాయకుల ఆధ్వర్యంలో 9.30 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేక్ కటింగ్‌తో పాటు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ ఆధ్వర్యంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేయనున్నారు. ఉదయం 10 గంటలకు 27వ వార్డులో కెక్కిరేణి నాగయ్య ఆధ్వర్యంలో కేక్ కటింగ్, 35వ వార్డులో గద్దల విజయశేఖర్ ఆధ్వర్యంలో జీపీఆర్ఎస్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు షూ పంపిణీ, భోజనం అందించనున్నారు.
12 గంటలకు సవరాల సత్యనారాయణ ఆధ్వర్యంలో కొత్తబస్టాండ్ ైప్లెఓవర్ కింద అన్నదానం, మధ్యాహ్నం 12.30 గంటలకు పల్స వెంకన్న ఆధ్వర్యంలో కాసరబాద అపూర్వ బధిరుల పాఠశాలలో అన్నదానం, దుర్గం ప్రభాకర్ ఆధ్వర్యంలో కేసారం చర్చిలో దుస్తుల పంపిణీ, ప్రత్యేక ప్రార్థనలు, చార్లెట్ అనాథ ఆశ్రమంలో నోట్‌బుక్స్ పంపిణీ చేయనున్నారు.
మధ్యాహ్నం 1 గంటకు సవరాల సత్యనారాయణ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద ఆశ్రమంలో అన్నదానం, 9వ వార్డులో మధ్యాహ్నం 2 గంటలకు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో జిల్లా ప్రజాప్రతినిదులు, మాజీ చైర్మన్లు, మాజీ వైస్ చైర్మన్లు, మాజీ కౌన్సిలర్లు, నూతన కౌన్సిలర్లు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు.