కరెంట్ అంటేనే కేసీఆర్!
సమైక్య పాలనలో కరెంట్ అంటేనే కన్నీటి వ్యధలకు రూపం. మూడు గంటలిస్తే ఆరు గంటల కోతలు. ఇచ్చిన దానిలోనూ సింగిల్ ఫేజే ఎక్కువ సమయం. ఇక త్రీఫేజ్ కరెంట్ ఇస్తే దఫదఫాలుగా వచ్చేది.
- ఉద్యమ నేత, మాజీ సీఎం కేసీఆర్‌తోనే కరెంట్ కష్టాలకు చెక్
- అన్ని కేటగిరీలకు నిరంతర విద్యుత్
- నాణ్యమైన కరెంట్ సరఫరాకు ప్రాధాన్యం
- రాష్ట్రం పట్ల చిత్తశుద్ధితోనే సాధ్యమైంది
- విద్యుత్ వెలుగులపై ప్రజల మనోగతం
నల్లగొండ ప్రతినిధి, జూన్19(నమస్తే తెలంగాణ) : సమైక్య పాలనలో కరెంట్ అంటేనే కన్నీటి వ్యధలకు రూపం. మూడు గంటలిస్తే ఆరు గంటల కోతలు. ఇచ్చిన దానిలోనూ సింగిల్ ఫేజే ఎక్కువ సమయం. ఇక త్రీఫేజ్ కరెంట్ ఇస్తే దఫదఫాలుగా వచ్చేది. దాంతో పొలం వద్ద ఉన్న రైతులకు కంటి మీద కునుకు ఉండేది కాదు. కార్కానాల ఉండే కార్మికుడికి పని దొరికేది కాదు. ఇక కరెంట్ మీద ఆధారపడే చిరు వ్యాపారస్తులకు చుక్కలు కనిపించేవి. తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి కాంగ్రెస్ పాలకుల కరెంట్ సరఫరా ఇట్లుంటదని కేసీఆర్ అప్పుడే చెప్పారు. కోతలు లేని నాణ్యమైన కరెంట్ రాష్ట్రం సాధించాక తెచ్చుకుందామంటూ ప్రజలకు మాటిచ్చారు. అందుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి సీఎంగా కేసీఆర్ విద్యుత్‌పై ప్రత్యేక దృష్టి సారించారు.
రాష్ర్టానికి అవసరమైన కరెంట్‌పై ప్రణాళికలు సిద్ధం చేశారు. ఓ వైపు రాష్ట్రంలో డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్లపై దృష్టి సారిస్తూనే తక్షణమే కరెంట్ ఇబ్బందులకు చెక్ పెట్టేలాగా ఇతర రాష్ర్టాల నుంచి కరెంట్ తెచ్చుకునేలా మరోవైపు కేంద్రీకరించి పనిచేశారు. వీటన్నింటి ఫలితంగానే ఉద్యమ సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడుతూ 2018 జనవరి 1 నుంచి వ్యవసాయానికి నిరంతరం ఉచిత విద్యుత్ సరఫరాకు శ్రీకారం చుట్టారు. గృహావసరాలకు, తర్వాత పరిశ్రమలకు సైతం 24 గంటల కరెంట్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇలా ఇచ్చే కరెంట్లోనూ తరుచూ అంతరాయాలు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరాకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు.
డిమాండ్‌కు అనుగుణంగా నాణ్యమైన కరెంట్ వివిధ వర్గాల ప్రజలకు అందించేందుకు కొత్త సబ్స్టేషన్ల నిర్మాణం, ఓహెచ్ లైన్ల విస్తరణ, ఎల్టీ లైన్ల నిర్మాణం, అదనపు ట్రాన్స్పార్మర్ల వంటివాటి కోసం ఒక్క నల్లగొండ జిల్లాలోనే సుమారు రూ.1100 కోట్లను వెచ్చించారు. దాంతో గృహ, వ్యవసాయం, పరిశ్రమలకు సైతం నిరంతరం నాణ్యమైన కరంట్ సరఫరా జరిగింది. ఎక్కడన్నా సాంకేతిక సమస్యలు మినహా విద్యుత్ కోతలు ఉండేవి కావు. పరిశ్రమల్లో మూడు షిఫ్టుల్లో పనిచేసినా ఇబ్బందిలేకుండా కరెంట్ ఇవ్వడంతో ఉపాధి అవకాశాలు విస్తృతమయ్యాయి. కుటీర, మధ్యతరహా, భారీ పరిశ్రమలు నిరంతరం పనిచేసేందుకు కరెంట్ దోహదపడింది. దాంతో సమైక్య పాలన నాటి చీకట్లు తొలగి ప్రజల జీవితాల్లో వెలుగులు ప్రసరించేలా కేసీఆర్ అవలంబించిన విద్యుత్ విధానాలు ఉపకరించాయనడంలో సందేహం లేదు.
అందుకే ప్రజల్లో సైతం కరెంట్ అంటే కేసీఆర్… కేసీఆర్ అంటే కరెంట్ అనేంత క్రేజ్ వచ్చింది. అట్లాంటి కేసీఆర్ ప్రారంభించిన నిరంతర కరెంట్‌కు మరకలు రుద్దే ప్రయత్నాలు జరుగుతుండడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కేసీఆర్‌పై కరెంట్ అభాండాలు వేసేలా కుట్రలు జరుగడం సరికాదంటున్నారు. కాంగ్రెస్ పాలకులు వీలైతే అంతకుమించి మరింత సమర్థవంతంగా విద్యుత్ సరఫరా చేసేందుకు కృషి చేసి రాష్ట్ర ప్రజల ప్రయోజనాల పట్ల తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని హితవు పలుకుతున్నారు. అంతేకానీ దేశంలోనే ఎక్కడా వీలుకాని విధంగా అన్ని రంగాలకు నిరంతర కరెంట్ సరఫరా ఇచ్చి సరికొత్త చరిత్ర లిఖించిన కేసీఆర్‌పై కక్ష్య సాధింపు సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
24 గంటల కరెంటుతో మిల్లులు మెరుగుపడ్డాయి
సమైక్య పాలనలో చిన్నతరహా పరిశ్రమల పరిస్థితి అధ్వానంగా ఉండేది. యువత బ్యాంక్ రుణాలు తీసుకొని మండలంలో పాలిష్, ముగ్గుమిల్లులు ఏర్పాటు చేసుకున్నారు. 2014కు ముందు కరెంటు కష్టాలు విపరీతంగా ఉండేవి. రోజుకు 6 గంటలు కూడా కరెంటు వచ్చే పరిస్థితి లేకుండె. వారానికి ఒకరోజు హాలిడే ప్రకటించారు. మిల్లుల్లో పనిచేసే కార్మికులకు పని లేకుండా పోయింది. కరెంటు సరిగా లేక మిల్లులు మూతపడేస్థితికి చేరాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ ప్రభుత్వం 24గంటల కరెంటు ఇవ్వడంతో మిల్లులు మెరుగుపడ్డాయి. కరెంటు కోతలు లేకుండా రోజంతా మిల్లులు నడిచాయి. నాటి కరెంటు కరువు పరిస్థితుల నుంచి చిన్న పరిశ్రమలకు కరెంటు ఇచ్చి ఆదుకున్న కేసీఆర్‌ను నేడు నిందించడం సరికాదు.
-పడిగెపాటి శ్రీనివాస్‌రెడ్డి, పాలిష్మిల్ యజమాని, దామరచర్ల
కేసీఆర్‌ను నిందించడం కరెక్ట్ కాదు
కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్‌ను బద్నాం చేయడం సరి కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పంట పొలాలను కాపాడుకునేందుకు రైతులు అరిగోసలు పడేవారు. 2014లో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ర్టానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతుల గోడు తీర్చేందుకు 24 గంటల నిరంతర కరెంట్ సరఫరా చేశారు. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ పాలన రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని చేశారు. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కేసీఆర్‌ను నిందించడం కరెక్ట్ కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కొలువైన నాటి నుంచి ఇప్పటివరకు రోజులో కనీసం 15 గంటల త్రీఫేజ్ కరెంటు ఇచ్చిన దాఖలాలు లేవు. కేసీఆర్ మాత్రం చిన్న, సన్నకారు రైతులతోపాటు పరిశ్రమలకు ఇబ్బందులు కలుగకుండా కరెంట్ సప్లయ్ చేశారు. అలాంటి కేసీఆర్‌పై కాంగ్రెస్ నాయకులు బురదజల్లడం సరి కాదు.
– వల్లమల్ల బాలస్వామి, రైతు, మొల్కపట్నం, వేములపల్లి మండలం
కరెంట్ ఎప్పుడు పోతుందో.. ఎప్పుడు వస్తుందో తెల్వట్లే..
మా గ్రామం ఎన్‌హెచ్-565పై ఉండడంతో రోడ్డు వెంటనే బైక్ సర్వీసింగ్‌తోపాటు పంచర్ షాపు నడుపుతూ జీవనం సాగిస్తున్నా. కరెంట్ ఉంటేనే నా పని సాగుతుంది. కేసీఆర్ పాలనలో 24 గంటలపాటు కరెంట్ ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో కూడా తెల్వట్లేదు. రోజులో పదిసార్లు కరెంట్ పోతుంది. కరెంట్ ఉన్నంత సేపు బైక్ సర్వీసింగ్, వాటర్ సర్వీసింగ్ చేస్తున్నా. కరెంటు సరిగా ఉండకపోవడంతో పంచర్ల గిరాకీ కూడా తగ్గి ఇబ్బందులు పడుతున్నాం. కరెంట్ పూర్తిస్థాయిలో ఉండకపోవడంతో బతుకు భారంగా మారింది. ఇప్పటికైనా 24గంటల కరెంటు ఉండేలా ప్రభుత్వం, అధికారులు చర్యలు చేపట్టాలి.
– నారగోని జానయ్య, బైక్ మెకానిక్, చిన్నసూరారం, నల్లగొండ మండలం
బీఆర్ఎస్ పాలనలో 24 గంటలు కరెంట్ వచ్చేది
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న తొమ్మిదిన్నరేండ్ల కాలంలో 24 గంటలపాటు కరెంట్ ఉండేది. చెరువులు, కుంటల్లో నీరు సమృద్ధిగా లభించేది. ఆ సమయంలో మాకు బోర్ల రిపేర్ గిరాకీ తక్కువగా ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మోటర్ రిపేర్ల గిరాకీ పెరిగింది. కరెంట్ సరైన సమయంలో రాకుండా ఉండడం, అలాగే అధికారులకు అవగాహన లేక కుంటలు, చెరువులను నింపకపోవడంతో భూగర్భజలాలు అడుగంటి బోర్లు పోయక మోటర్లు కాలిపోతున్నాయి. సరైన సమయంలో కరెంట్ ఇవ్వకపోవడంతో మోటర్లు కాలిపోయి రిపేర్ల గిరాకీ పెరిగింది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి దేశానికి వెన్నెముక అయిన రైతుల సమస్యలను పరిష్కరించాలి.
-కోదాటి నరేందర్, మోటర్ మెకానిక్, కుక్కడం, మాడ్గులపల్లి మండలం
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

