కొన్ని సంఘటనలు పదికాలాలు గుర్తుండిపోతాయి. 2023 అలాంటివెన్నో మోసుకొస్తున్నది! గతకాలం కన్నామెచ్చు కాలాన్నంటూ మచ్చుతునకల్ని ఎన్నిటినో తనలో పొదుగుకొని అడుగిడింది నూతన సంవత్సరం.వెండితెరపై మెరుపులతో సినీప్రియులకు వినోదాన్ని పంచనుంది. క్రీడాంగణంలో మెగా ఈవెంట్లతో అభిమానులను అలరించడానికి సిద్ధమైంది. అంతేకాదు, రాజకీయ రణరంగంలో మలుపులతో భవిష్యత్తుకు బాటలుపరుస్తానని చెబుతున్నది. వెరసి 2023 చరిత్రపుటల్లో తన ప్రత్యేకతను చాటుకునేందుకు విచ్చేసింది. ఈ ఏడాది తీసుకొస్తున్న వింత కవ్వింతలేంటో ఒకింత తెలుసుకుందాం..
వెండితెర వెలుగులీనేలా..
టాలీవుడ్‌కు మెగా విజయాలు కట్టబెట్టేందుకు రెడీ అంటున్నది 2023. ఆదిలోనే అదిరిపోయే సినిమాలతో వెండితెరకు వెలుగులు పంచుతున్నది. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘వీర సింహారెడ్డి’ విడుదల కాబోతున్నది. ప్రేక్షకులకు పూనకాలు లోడింగ్ చేయడానికి చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ కూడా ఇదే నెల 13న రిలీజ్ అవుతున్నది. రెండు భారీ సినిమాలతో ప్రయాణం మొదలుపెడుతున్న ఈ సంవత్సరం.. ఏడాది పూర్తయ్యేనాటికి మరిన్ని హిట్లు తన ఖాతాలో వేసుకోనుంది. ఈ రెండు చిత్రాల్లో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నవీ ఉన్నాయి.
అన్నీ కుదిరితే ‘పుష్ప-2’ ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకురానుంది. 2021 ఆఖర్లో విడుదలైన ‘పుష్ప’ సృష్టించిన సంచలనం అంతాఇంతా కాదు. దీనికి కొనసాగింపు మరింత ఇంపుగా ఉంటుందని దర్శకుడు సుకుమార్ చెబుతున్నాడు. అందుకు తగ్గట్టుగా కథలో మార్పులు కూడా చేసినట్టు సమాచారం. ఈ ఏడాది ప్రేక్షకులు ఎదురుచూస్తున్న మరో చిత్రం ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘సలార్’. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈలోపు ప్రభాస్ రాముడి పాత్రలో నటించిన ‘ఆదిపురుష్’ కూడా బాక్సాఫీస్ ముందుకురానుంది. మూవీ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో దీనిని నిర్మిస్తున్నారు.
అయితే, గతేడాది అక్టోబర్‌లో విడుదలైన ఈ సినిమా టీజర్‌పై తీవ్రస్థాయిలో ట్రోల్స్ రావడంతో.. విజువల్ ఎఫెక్ట్స్‌ను మరింత ఎఫెక్టివ్‌గా తీర్చిదిద్దేపనిలో ఉన్నారు దర్శకుడు ఓం రౌత్. ఇక, పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న చారిత్రక చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఈ ఏడాదే ప్రేక్షకులను పలకరించనుంది.దర్శకుడు శంకర్, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. ఇదే జోరు కొనసాగితే 2023లోనే ఈ మెగా మూవీ విడుదలవుతుంది. మరోవైపు శంకర్ కలల ప్రాజెక్ట్ ‘భారతీయుడు-2’ కూడా సెట్స్ మీద ఉంది.1996 వేసవిలో విడుదలై రికార్డులు సృష్టించిన సినిమా ‘భారతీయుడు’. మళ్లీ 26 ఏండ్ల తర్వాత కమల్‌హాసన్, శంకర్ కాంబినేషన్ కుదిరింది. అన్నీ సవ్యంగా సాగితే ఈ ఏడాది వేసవి వసూళ్లు ‘భారతీయుడు-2’ కొల్లగొట్టడం ఖాయం.
తమిళనాడులో 2022లో ప్రభంజనం సృష్టించిన చారిత్రక చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్-1’. తెలుగులో ఓ మోస్తరు కలెక్షన్లు వసూలు చేసిన ఈ సినిమా ఓటీటీలో మంచి విజయాన్ని సాధించింది. ‘పీఎస్-1’
ైక్లెమాక్స్‌లో దర్శకుడు మణిరత్నం ఇచ్చిన ట్విస్ట్ ‘పీఎస్-2’ కోసం ప్రేక్షకులను ఎదురుచూసేలా చేసింది. ఇప్పటికే రెండో భాగం షూటింగ్ సింహభాగం పూర్తయిందట. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నట్టు కోలీవుడ్ టాక్. ఈ ఏడాది ఏప్రిల్‌లో ‘పీఎస్-2’ విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు. మొత్తంగా 2023 ప్రేక్షకులకు కన్నులవిందు చేయడం ఖాయంగా కనిపిస్తున్నది. అయితే, ఈ చిత్రాల్లో ప్రేక్షకుల ఎదురు
చూపులకు తగ్గట్టుగా విజయం సాధించేవి ఎన్ననేది కాలమే తేల్చాలి.
మరిన్ని మెరుపులు
షారుఖ్ ఖాన్ నటించిన సినిమాలు నాలుగేండ్ల తర్వాత థియేటర్లలో విడుదల కానున్నాయి. ఆయన నటించిన మూడు సినిమాలు ఈ ఏడాది బాక్సాఫీస్ ముందుకు రానున్నాయి. జనవరిలో పఠాన్, జూన్‌లో జవాన్, డిసెంబర్లో డంకీ రిలీజ్ అవుతాయి.
ఈ ఏడాదితో లండన్‌లోని వెంబ్లీ స్టేడియం నూరేండ్లు పూర్తి చేసుకోనుంది. 1923
ఏప్రిల్‌లో దీనిని ప్రారంభించారు. వేలాది ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు వేదికగా నిలిచిన
ఈ మైదానం శతాబ్ది ఉత్సవాన్ని జరుపుకోనుంది.
అమెరికాకు చెందిన మీడియా ఎంటర్టైన్మెంట్ సంస్థ డిస్నీ ప్రారంభమై 2023 అక్టోబర్‌తో నూరేండ్లు పూర్తవుతాయి.
ఆటాడుకుందాం రా..!
టీ20 వరల్డ్ కప్, ఫిఫా ప్రపంచకప్ తదితర భారీ ఈవెంట్లతో 2022 క్రీడాభిమానులకు కలకాలం గుర్తుండిపోతుంది. గతేడాదికి ఏ మాత్రం తీసిపోని విధంగా ప్రపంచస్థాయి ఆటల పోటీలకు 2023 ఆతిథ్యం ఇవ్వనుంది. మొదటి నెలలోనే హాకీ వరల్డ్ కప్‌తో బోణీ కొడుతున్నది. జనవరి 13 నుంచి 29 వరకు భువనేశ్వర్, రూర్కెలా వేదికగా హాకీ వరల్డ్‌కప్ జరగనుంది. మొట్టమొదటి అండర్ 19 ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ క్రీడాభిమానులకు అదనపు వినోదాన్ని పంచనుంది. నాలుగేండ్లకు ఒకసారి వచ్చే క్రికెట్ కుంభమేళా ఐసీసీ వరల్డ్ కప్ 2023లో మనదేశంలో జరగనుంది. అక్టోబర్, నవంబర్ మాసాల్లో జరిగే పోటీల్లో పది జట్లు పాల్గొననున్నాయి. 13వ ప్రపంచకప్‌ను భారత జట్టు ముద్దాడితే.. 1983, 2011 సంవత్సరాల్లా ఈ ఏడాదీ భారతీయులకు సదా స్మరణీయం అవుతుంది. గతేడాది చైనాలోని హాంగ్జావ్లో జరగాల్సిన 19వ ఆసియా క్రీడలు వాయిదాపడ్డాయి. దాంతో ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వీటిని నిర్వహించనున్నారు. అయితే, చైనాలో కరోనా విజృంభిస్తుండటంతో ఈవెంట్ ప్రశ్నార్థకంగా మారింది. ఇదే ఏడాది ఫిఫా ఉమెన్స్ వరల్డ్‌కప్ పోటీలు అభిమానులను అలరించనున్నాయి.
పొలిటికల్ సెమీఫైనల్స్
రాబోయే రోజుల్లో దేశ రాజకీయాలు ఏ విధంగా మలుపు తిరగనున్నాయో 2023 తేల్చేయనుంది. ఈ ఏడాది తొమ్మిది రాష్ర్టాల్లో విధానసభ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణతోపాటు త్రిపుర, కర్ణాటక,
ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది. 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ తొమ్మిది రాష్ర్టాల ఎన్నికలను సెమీఫైనల్స్‌గా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. సంక్షేమం, అభివృద్ధి జోడు గుర్రాలుగా తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలో అగ్రపథాన నిలబెట్టిన భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ విజయాలకు 2023 సాక్షిగా నిలవనుంది.