నేలను ఎడారి చేసినా
పసిరిక పచ్చగానే మొలకెత్తుతుంది
వేళ్ల మధ్య బంధించినా, సీతాకోక చిలుక
రంగుల రెక్కలు విప్పుకునే ఎగురుతుంది
పుటుక్కున తుంచేసినా, పూవు
పరిమళాన్నే పంచుతుంది
ఆకాశానికి మసి పూసినా, భానుడు
భగభగలాడుతూనే పైకి లేస్తాడు
గొంతు నులిమేసినా, అవమానం
కంచు కంఠమై మోగుతుంది
పిల్లల బుగ్గలపై బాయొనెట్లు దించినా
వారు బోసి నవ్వులే చిందిస్తారు
వసివాడనివారి చేతుల్లో తుపాకులు పెట్టినా
వాళ్లు అక్షరాలనే దిద్దుతారు
మీరు బంగారం దోచుకొచ్చినా
స్వాంతన కోసమే అర్రులు చాస్తారు
శాంతి పేరుతో మొదలైన యుద్ధం
చివరికి మనశ్శాంతినే మిగల్చాలి అప్పుడిక,
ఏ తల్లయినా, బిడ్డల్ని వీరులుగా కాదు-
మనుషులుగానే తీర్చిదిద్దుతుంది.
దేశరాజు
9948680009