చదువుల్లో, ఆటపాటల్లో పోటీని తట్టుకుని నిలవడమెలాగో, గెలవడమెలాగో తల్లిదండ్రులే పిల్లలకు నేర్పించాలి. అది కన్నవారి బాధ్యత. మీ ప్రవర్తనను పిల్లలు అనుకరిస్తారు. మీరే వాళ్లకు రోల్‌మోడల్. కొడుకో, కూతురో వైఫల్యంతో ఇంటికొచ్చిన ప్రతిసారీ.. దగ్గరికి తీసుకుని నాలుగు మంచిమాటలు చెప్పాలి. ఒక్క ర్యాంకుతోనో, ఒక్క పతకంతోనో, ఒక్క ఇంటర్వ్యూ వైఫల్యంతోనో ఏమీ కాదని ధైర్యం నింపాలి. మీ చిన్నప్పటి అనుభవాలను వివరించాలి. సవాళ్లను గెలిచి విజయాలు సాధించినవారి కథలు వినిపించాలి. దీనివల్ల నిరాశను, ఓటమిని జయించటం ఎలాగో వారికి అర్థమవుతుంది. అంతేకానీ, గట్టిగా మందలిస్తే మరింత ఒత్తిడికి గురవుతారు. మనసులోని ఆందోళనలను, గుండెల్లోని సమస్యలను స్వేచ్ఛగా పంచుకోగలిగే వాతావరణం ఉన్నప్పుడే.. బిడ్డల వ్యక్తిత్వం వికసిస్తుంది. చదువులూ పరీక్షలనే కాదు, ఏ విషయంలోనైనా సరే, మీ వెనకాలే ఉన్నామన్న భరోసా కల్పించాలి.