పచ్మఢీ.. విహారానికి రెడీ
మధ్యప్రదేశ్ మధ్యలో దాగున్న అద్భుతం పచ్మఢీ. వింధ్య సాత్పుర పర్వతశ్రేణుల్లో పరుచుకున్న చిక్కటి అడవి జలపాతాల హోరుతో అలరిస్తూ ఉంటుంది.
పౌరాణిక ప్రాశస్త్యం ఉన్న క్షేత్రం. ప్రకృతి సోయగాలన్నీ ఒకేచోట నెలకొన్న ప్రాంతం. అంతుచిక్కని అడవిలో.. లోతు తెలియని లోయలు. దట్టమైన చెట్లతో పచ్చలు పొదిగినట్టున్న గిరులు ఓ వైపు.. వాటి మధ్య ముత్యాల వరుసలు పేర్చినట్టుండే జలపాతాలు ఇంకోవైపు. ఇన్నేసి అందాలు ఒకేసారి చూడాలంటే పచ్మఢీకి వెళ్లాల్సిందే. మాన్సూన్ విహార యాత్రకు మన్నికైన నెలవుగా పేరున్న పచ్మఢీ విశేషాలివి..
మధ్యప్రదేశ్ మధ్యలో దాగున్న అద్భుతం పచ్మఢీ. వింధ్య సాత్పుర పర్వతశ్రేణుల్లో పరుచుకున్న చిక్కటి అడవి జలపాతాల హోరుతో అలరిస్తూ ఉంటుంది. తొలకరి వేళలో.. ఈ జలపాతాలు కొత్త గతులతో వీనుల విందు చేస్తాయి. పచ్చదనం మరింత చిక్కగా విస్తరిస్తుంది. ఈ అందాల కానలో ఐదు గుహల కోన పచ్మఢీ ప్రత్యేకతగా చెప్పుకోవాలి. ద్వాపరయుగంలో వనవాస సమయంలో పాండవులు ఈ గుహల్లో నివసించారట. ఈ ఐదు గుహల పేరిట ఈ ప్రాంతానికి పాంచ్మఢీ… పచ్మఢీ అన్న పేరు స్థిరపడింది. నేటికీ ఈ ఐదు గుహలు మహాభారత కథకు ఆనవాళ్లుగా దర్శనమిస్తాయి. ఈ గుహలకు సమీపంలో ద్రౌపది జలకాలాడిందని చెప్పే కోనేరు ఉంటుంది. దీనిని పాంచాలి సరస్సు అని పిలుస్తారు.

పాండవ గుహలు చూడటంతో పచ్మఢీ పర్యటన మొదలవుతుంది. వీటికి సమీపంలో జటాశంకర గుహ ప్రత్యేకంగా ఉంటుంది. తానిచ్చిన వర ప్రభావంతో తన నెత్తినే చేయిపెట్టి అంతం చేయాలనుకున్న భస్మాసురుడి నుంచి తప్పించుకోవడానికి పరమేశ్వరుడు ఈ గుహలో దాక్కున్నాడని స్థల పురాణం. ఈ గుహలో 108 శివలింగాలు కనిపిస్తాయి. ఇక్కడే గుప్త గంగ అనే కుండం ఉంది. ఇక్కడికి అల్లంత దూరంలో మహాదేవ కొండ ఉంది. దానిపై బడే మహాదేవ్ గుహ ఉంది. విష్ణుమూర్తి మోహినీ రూపంలో వచ్చి భస్మాసురుణ్ని ఇక్కడే సంహరించాడని స్థలపురాణం. ఈ గుహలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల విగ్రహాలు దర్శనమిస్తాయి. మధ్యలో ఓ జలకుండం ఉంటుంది. ఇందులోని నీళ్లు ధారగా వచ్చి ఇక్కడి శివలింగాన్ని నిరంతరం అభిషేకిస్తుంటాయి.
గుహలకే కాదు.. జలపాతాలకూ అడ్డా పచ్మఢీ. వీటిలో రజత్ ప్రతాప్ జలపాతం సుందరమైనది. సుమారు 351 అడుగుల ఎత్తు నుంచి కిందికి దూకే జలధారలు అచ్చంగా వెండి వెలుగులు విరజిమ్ముతాయి. అందుకే దీనికి రజత్ ప్రతాప్ జలపాతం అన్న పేరు వచ్చింది. జలపాతం కింద సరస్సు అచ్చెరువొందిస్తుంది. లోతు కూడా తక్కువగానే ఉంటుంది. జలధారల సోయగాలు ఆస్వాదిస్తూ.. గంటల తరబడి ఈ కొలనులో జలకాలాడొచ్చు. ఇదే ఇలాఖాలో అప్సర విహార్ అనే జలపాతమూ ఉంది. రజత జలపాతం నుంచి వచ్చే ప్రవాహమే… మళ్లీ ఇక్కడ జలపాతంగా ఏర్పడింది.
భస్మాసుర సంహారం తర్వాత మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఇందులో స్నానం చేశాడట. అందుకే దీనికి అప్సర జలపాతం అన్న పేరు స్థిరపడింది. ఈ జలపాతం పరిసరాలు సమ్మోహనపరిచేలా ఉంటాయి. పచ్మఢీలో అలరించే మరో జలపాతం బీ ఫాల్. దీన్ని జమునా ప్రతాప్ జలపాతం అని కూడా పిలుస్తారు. 150 అడుగుల ఎత్తు నుంచి ఏటవాలు కొండ మీదుగా జాలువారే జలధారలు పర్యాటకులకు పసందు చేస్తాయి. వేసవి విడిదిగా పేరున్న పచ్మఢీ వానకాలం ప్రారంభంలో మరింత సుందరంగా కనిపిస్తుంది. శీతకాల విహార కేంద్రంగానూ దీనికి పేరుంది. జూన్, జూలై, అక్టోబర్-ఫిబ్రవరి వరకు పర్యటనకు అనువైన కాలం. భారీ వర్షాలు కురిసే ఆగస్టు, సెప్టెంబర్ మాసాలు పచ్మఢీ పర్యటనకు అనుకూలం కాదు.

- ఇవీ చూడండి
- హాండీ బో లోయ
- రాజేంద్రగిరి
- దూప్గఢ్ వ్యూ పాయింట్
ఇలా చేరుకుందాం
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి పచ్మఢీ 195 కి.మీ. దూరంలో ఉంటుంది. ఇక్కడినుంచి బస్సులు, ప్రైవేట్ ట్యాక్సీలు ఉంటాయి. హైదరాబాద్ నుంచి భోపాల్కు రైలు సదుపాయం ఉంది. పచ్మఢీలో బసకు అనేక హోటళ్లు, లాడ్జింగులు అందుబాటులో ఉన్నాయి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

