బాత్రూమ్లో సహజంగా వచ్చే దుర్వాసనను పోగొట్టడంలో కొన్ని రకాల ఇండోర్ మొక్కలు అద్భుతంగా పనిచేస్తాయి. గాలిని శుద్ధి చేయడానికీ సాయపడతాయి. ఇందుకోసం బాత్రూమ్లో ఉండే తేమ, తక్కువ వెలుతురును తట్టుకుని పెరిగే మొక్కల్ని ఎంచుకోవడం మంచిది.
స్నేక్ ప్లాంట్ : బాత్రూమ్కి అత్యంత అనువైన మొక్కల్లో స్నేక్‌ప్లాంట్ ఒకటి. ఇది గాలిలోని టోలిన్, బెంజీన్ వంటి విషవాయువులను పీల్చుకుంటుంది. రాత్రిపూట కూడా ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. గాలిలో తేమను క్రమబద్ధీకరించి.. దుర్వాసనను పోగొడుతుంది.
కలబంద: పెరట్లో పెంచుకునే కలబందను.. బాత్రూమ్లోకీ మార్చుకోవచ్చు. గాలి నాణ్యతను పర్యవేక్షించడంలో ఇది ముందుంటుంది. గాలిలో కాలుష్య కారకాలు పెరిగితే.. దీని ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. తద్వారా మనకు ఓ హెచ్చరిక అందుతుంది.
మనీ ప్లాంట్: ఏ వాతావరణంలోనైనా పెరిగే శక్తి.. మనీ ప్లాంట్ సొంతం. ఇది గాలిలోని దుర్వాసనను పీల్చుకోవడమే కాకుండా.. మానసిక ప్రశాంతతనూ అందిస్తుంది.
స్పైడర్ ప్లాంట్: తక్కువ వెలుతురులో పెరిగే మరో అందమైన మొక్క.. స్పైడర్ ప్లాంట్. దీని నిర్వహణ చాలా సులభం. కార్బన్ మోనాక్సైడ్, ఇతర దుర్వాసనలను తొలగించి.. గాలిని స్వచ్ఛంగా మారుస్తుంది.