Biradari | ఏడుపు తన్నుకొస్తుంది. ఏడ్వలేరు. మగవాళ్లు ఏడిస్తే.. సమాజం నవ్వుతుంది మరి. బాధ కలుగుతుంది. ఎవరితోనూ పంచుకోలేరు. పంచుకుంటే.. నలుగురిలో చులకన అయిపోతారు పాపం. ఎంతకాలం ఉద్వేగాల్ని దాచుకోవాలి? దాచుకున్నకొద్దీ గుండె బరువెక్కుతుంది. మెదడు వేడెక్కిపోతుంది. మానసిక సమస్యలకు దారితీస్తుంది. అధిక రక్తపోటు, గుండె సమస్యలు వచ్చినా రావచ్చు. పురుషుల్లో గూడుకట్టుకున్న భావోద్వేగాల భారాన్ని దింపేసి, సాంత్వన చేకూర్చడానికి ఆవిర్భవించిందే.. బిరాదరి. ఇది పురుషులకే ప్రత్యేకమైన సమూహం. సభ్యులు జూమ్ కాల్స్ ద్వారా భావోద్వేగాలను పంచుకుంటారు. ప్రస్తుతం బెంగళూరులోనే సేవలు లభ్యం.
తమిళనాడుకు చెందిన సంగీత ఉపాధ్యాయుడు శివేన్ ప్రేమ్, బెంగళూరు నివాసి కల్పేశ్ మోరే.. ఇద్దరి సంకల్పానికి ప్రతి రూపమే బిరాదరి. ఇది పురుషుల కోసం ఏర్పాటు చేసిన వేదిక. ఇప్పటికే మహిళల కోసం జనాన్, గుల్నార్ తదితర సంస్థలు పనిచేస్తున్నాయి. పాపం మగాళ్లకే ఒక్క వేదికా లేదు. ఆ లోటు తీర్చడానికే శివేన్, కల్పేశ్ దీన్ని స్థాపించారు. ఇక్కడ పురుషులకే సభ్యత్వం. బిరాదరి మెంబర్స్ ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకూ ఆన్లైన్లో సమావేశం అవుతారు. కొంతసేపు ధ్యానం చేస్తారు. ఆ తర్వాత తమ సమస్యలు పంచుకుంటారు. భావోద్వేగాలను స్వేచ్ఛగా వెల్లడిస్తారు. వినేవారూ శ్రద్ధగా వింటారు. ఎలాంటి తీర్పులూ ఇవ్వరు. ఏవైనా స్పందనలు ఉన్నా.. వాటిని చాట్ బాక్స్‌లో పంచుకోవాలి. పద్యం, పాట, ఏదో ఓ కళా ప్రదర్శనతో నాటి సమావేశాన్ని ముగిస్తారు.
‘ఒక్క సైకియాట్రిస్ట్‌తో తప్ప ఇప్పటివరకు నేను ఎవరితోనూ నా భావాలను పంచుకోలేదు. కానీ, బిరాదరి సమావేశాల్లో మాత్రం మనసు విప్పగలుగుతున్నా. నేను చేసిన తప్పులను చెప్పుకొంటున్నా. ఇతరులు చెప్పిందీ సావధానంగా వింటున్నా’ అంటూ తన అనుభవాల్ని వ్యక్తంచేస్తున్నాడు సమీర్ మిశ్రా అనే సభ్యుడు. తను ముంబైలో ఐటీ ఉద్యోగి. ఏడాదిగా బిరాదరితో ప్రయాణం సాగిస్తున్నాడు. కరోనా కాలంలో బిరాదరి జూమ్ కాల్స్‌లో భాగమయ్యే సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత కొంత తగ్గిపోయింది. ఇందులోని సభ్యులంతా 21 45 ఏండ్ల వారే.
మోరే, ప్రేమ్ చిన్నప్పటినుంచీ తల్లి సమక్షంలోనే ఎక్కువగా గడిపారు. ఏ సమస్య వచ్చినా అమ్మతోనే పంచుకున్నారు. వయసు పెరిగేకొద్దీ పెద్దరికం వచ్చింది. మగవాడు అనే ముద్ర పడింది. తల్లికి, చెల్లికి చెప్పుకొనే పరిస్థితి లేకపోయింది. స్నేహితులతో షేర్ చేసుకోడానికి కూడా నామోషే. దీంతో ఉద్వేగాలన్నీ పోగైపోతున్న భావన కలిగింది. అప్పుడే ఓ వేదిక అవసరం తెలిసొచ్చింది. ‘సాధారణంగా పురుషులు తాగడానికో, గాసిప్స్ మాట్లాడుకోడానికో కలుసుకుంటారు. ఈ సమావేశాల్లో కూడా తొలినాళ్లలో కొందరు సభ్యులు చేతిలో గ్లాసుతో స్క్రీన్ మీద ప్రత్యక్షమయ్యేవారు. ఆ తర్వాత, మద్యనిషేధం విధించారు.
వినడం మాత్రమే..
‘నేను ఓ అమ్మాయిని మనసారా ప్రేమించాను. కానీ తను మాత్రం నిట్టనిలువునా ముంచేసి పోయింది’ అంటూ ఓ దేవదాసు తన గోడు వెళ్లగక్కుకుంటాడు.
‘మా లేడీబాస్ ఉంది చూశారూ? మహా రాక్షసి.
మగజాతిని అంతం చేయడానికే పుట్టినట్టు కనిపిస్తుంది’ అంటూ ఓ ట్రైనీ మేనేజర్ కన్నీళ్లు పెట్టుకుంటాడు.
‘ఏమని చెప్పమంటారు బ్రో. మా ఆవిడ నన్ను రోజూ చితకబాదేస్తుంది. అత్తింటివాళ్లకు చెబుదామంటే ఆత్మాభిమానం అడ్డొస్తుంది’ అంటాడో సంసారి.
భావోద్వేగాలను అణచుకోవడం, వెలివేతకు గురికావడం, ఒంటరితనం, అనుబంధాల సమస్యలు, వృత్తికి సంబంధించిన ఒత్తిళ్లు.. ఇలా బిరాదరి సమావేశాల్లో అనేకం చర్చకు వస్తాయి. ఇది భావోద్వేగాలు పంచుకుని ఓదార్పు పొందే వేదిక మాత్రమే. ఇక్కడ ఎలాంటి చికిత్సా అందించరు. సమావేశాల్లో పాల్గొనేవాళ్లు బిరాదరి నిర్వాహకులకు ఒక సెషన్‌కు రూ. 200 నుంచి రూ. 700 మధ్య చెల్లించాల్సి ఉంటుంది. అయితే రుసుము తప్పనిసరి కాదు. ఇష్టం ఉంటేనే!
ఇక బిరాదరీలో సైన్ అప్ అయినవారికే జూమ్ సమావేశాల లింక్ ఇస్తారు. కుటుంబం, ఉద్యోగం, సమాజం ఇలా వివిధ రకాల వాతావరణాల్లో ఒత్తిడి ఎదుర్కొంటున్న పురుషులకు తమ భావోద్వేగాలను వ్యక్తం చేయడానికి బిరాదరి లాంటి ఓ దరి ఉండటం మంచిదే. సమావేశం తర్వాత చాలామంది మనసులు తేలికపడతాయి. మరో ఆదివారం వరకూ.. జీవనసమరం చేయడానికి సరిపడా మనోధైర్యం వచ్చేస్తుంది. ‘ఆడు మగాడ్రా బుజ్జీ’ అనిపించుకోవడం పొగడ్తలాంటి ఓ తెగడ్తే! మొత్తానికి మగజాతి ఆణిముత్యాలకు ఓ సంఘమంటూ వచ్చింది.
భావోద్వేగాలను అణచుకోవడం, వెలివేతకు గురికావడం, ఒంటరితనం, అనుబంధాల సమస్యలు, వృత్తికి సంబంధించిన ఒత్తిళ్లు.. ఇలా బిరాదరి సమావేశాల్లో అనేకం చర్చకు వస్తాయి. బిరాదరి అనేది భావోద్వేగాలు పంచుకుని ఓదార్పు పొందే వేదిక మాత్రమే. ఇక్కడ ఎలాంటి చికిత్సా అందించరు.