Suicide Attempt | పెద్దపల్లి రూరల్, సెప్టెంబర్ 28 : పెద్దపల్లి మండలంలో ఓ యువకుడు మద్యం సేవిస్తూ పురుగుల మందు తాగుతున్న వీడియో ఇన్ స్ట్రా గ్రామ్ లో కలకలం రేపుతోంది. పెద్దపల్లి మండలం మారెడుగొండ గ్రామ శివారు ప్రాంతంలోనే పంట పొలాల్లో పురుగుల మందు తాగినట్లుగా వచ్చిన వీడియోతో మారేడుగొండ, దావన్నపల్లి , జగన్నాథపురం గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది. సదరు యువకుడు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియో కలకలం రేపుతోంది. ‘కర్ణ karna-mudhiraj -213’ అనే ఐడీ నుంచి తాను క్రిమిసంహారక మందు, మద్యం సేవిస్తున్న వీడియోను పోస్ట్ చేసి, తనపై ఎన్ని కేసులు పెట్టుకుంటే పెట్టుకోండి.. తాను చనిపోతున్నట్లు పేర్కొన్నట్లు సమాచారం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గ్రామస్తులు, పోలీసులు అప్రమత్తమై యువకుడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. దావన్నపల్లి నుంచి జగన్నాధపురం వెళ్లే పొలాల మార్గంలో యువకుడు వెళ్లినట్లు పోలీసులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. దీంతో యువకుడి ఫొటోను మారేడుగొండ, దావన్నపల్లి, జగన్నాధపురం గ్రామాల వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తూ, ఎక్కడైనా కనిపిస్తే వెంటనే గ్రామ పోలీస్ అధికారికి సమాచారం అందించాలని పోలీసులు, ప్రజాప్రతినిధులను కోరారు. యువకుడు ఆదివారం పోస్ట్ చేసిన వీడియో వైరల్ కావడంతో అతడి ఆచూకీ కోసం గ్రామస్తులు పెద్ద ఎత్తున వెతుకులాట ప్రారంభించారు. ఎక్కడ చూసినా సదరు యువకుడు కనిపించకపోవడంతో ఆందోళన నెలకొంది. కొంతమంది గ్రామస్తులను అడిగి తెలుసుకోగా, యువకుడు సిద్ధిపేటకు చెందిన వ్యక్తిగా తెలిసిందని, తమ గ్రామానికి వచ్చి ఇలా ఎందుకు చేశాడో అర్థం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం యువకుడి ఆచూకీ కోసం పోలీసులు, గ్రామస్తులు గాలిస్తున్నారు.