ఫ్లోరిడా: మార్-ఎ-లాగో. ఇది ట్రంప్ ఇళ్లు. ఈ భవనం ఫ్లోరిడా రాష్ట్రంలోని పామ్ బీచ్‌లో ఉంది. దీన్ని అమెరికా మహిళా వ్యాపారవేత్త మర్జోరీ మేరీవెదర్ నిర్మించారు. తొలిసారి 1927లో ఈ విల్లాను ఓపెన్ చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మార్-ఎ-లాగో ఇంటిని 1985లో కొనుగోలు చేశారు. ఈ ఎస్టేట్‌ను 10 మిలియన్ల డాలర్లకు ట్రంప్ సొంతం చేసుకున్నారు. ఇక 2018 ఫోర్బ్స్ లెక్కల ప్రకారం ఆ ఇంటి ఖరీదు సుమారు 160 మిలియన్ల డాలర్లు. చాలా ఏళ్ల నుంచి వింటర్ సమయంలో ట్రంప్ ఇక్కడే గడుపుతుంటారు. దీన్ని వింటర్ వైట్ హౌజ్ అంటూ ఆయన పిలుస్తుంటారు. 2021 అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తర్వాత ట్రంప్ వైట్‌హౌజ్‌ను వీడి ఇక్కడే నివసిస్తున్నారు. న్యూజెర్సీలోని బెడ్‌మినిస్టర్‌లో ఉన్న గోల్ఫ్ క్లబ్లో సాధారణంగా ట్రంప్ తన సమ్మర్ డేస్‌ను గడుపుతుంటారు. ఎందుకంటే వేసవి మే నెలలో మార్-ఎ-లాగోను మూసివేస్తారు. మార్-ఎ-లాగో మొత్తం సుమారు 20 ఎకరాలు ఉంటుంది. ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్న రెండవ అతిపెద్ద విలాసవంతమైన ఎస్టేట్ ఇదే. ఎస్టేట్‌లో కొంత ప్రైవేటు భాగాన్ని కేవలం ట్రంప్ ఫ్యామిలీ కోసం వినియోగిస్తారు. మార్-ఎ-లాగో ఓ ఎక్స్‌క్లూజివ్ క్లబ్. దీంట్లో జాయిన్ కావాలంటే రెండు లక్షల డాలర్లు చెల్లించాలి. ఆ తర్వాత ప్రతి ఏడాది సభ్యత్వం కోసం 14వేల డాలర్లు కట్టాల్సి ఉంటుంది.
ప్రస్తుతం మార్-ఎ-లాగో ఇంట్లో ఎఫ్‌బీఐ సోదాలు చేస్తోంది. వైట్‌హౌజ్ నుంచి క్లాసిఫైడ్ రికార్డులను ట్రంప్ ఇంటికి తెచ్చి ఉంటారన్న కోణంలో ఆ తనిఖీ సాగుతోంది. అయితే ఈ సోదాల గురించి న్యాయశాఖ కానీ, ఎఫ్‌బీఐ కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఆ తనిఖీల గురించి తమకు కూడా తెలియదని శ్వేతసౌధం ప్రకటించింది. కానీ సెర్చ్ వారెంట్ వచ్చిన తర్వాత యూఎస్ సీక్రెట్ సర్వీస్‌ను ఎఫ్‌బీఐ అలర్ట్ చేసింది. ఆ వారెంట్‌ను వెరిఫై చేసిన తర్వాత ఎఫ్‌బీఐని ఇంట్లోకి అనుమతించారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం 10 గంటలకు గోల్ఫ్ క్లబ్‌లోకి ఎంటర్ అయిన ఎఫ్‌బీఐ.. దాదాపు 15 బాక్సులతో మధ్యాహ్నం వెళ్లిపోయారు. ఎఫ్‌బీఐ వెళ్లిపోయిన తర్వాత మార్-ఎ-లాగో ఎస్టేట్‌ను మళ్లీ సీక్రెట్ సర్వీస్ ఆధీనంలోకి తీసుకున్నది. సుమారు 30 మంది ఎఫ్‌బీఐ ఏజెంట్లు సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.
శ్వేత సౌధంలోని రహస్య పత్రాలను ట్రంప్ తన ఇంటికి తీసుకువెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఫిబ్రవరిలో నేషనల్ ఆర్కీవ్స్ .. ప్రెసిడెన్షియల్ రికార్డుల పరిరక్షణ కోసం ట్రంప్ ఇంట్లో సెర్చ్ చేయాలని న్యాయశాఖను కోరింది. అధికారిక పత్రాలను ట్రంప్ ఎక్కడ దాచాడో తెలుసుకోవాలని నేషనల్ ఆర్కీవ్స్ అడిగింది. అయితే సోమవారం మార్-ఎ-లాగో నుంచి సుమారు 15 బాక్సులను స్వాధీనం చేసుకున్నట్లు నేషనల్ ఆర్కీవ్స్ వెల్లడించింది. వీటిల్లో రహస్య సమాచారానికి చెందిన రికార్డులు కూడా ఉన్నట్లు తేలింది. అమెరికా అధ్యక్షులు ఎవరైనా చట్టం ప్రకారం.. తమ వద్ద ఉన్న లెటర్లు, వర్క్ డాక్యుమెంట్లు, ఈమెయిళ్లను నేషనల్ ఆర్కీవ్స్‌కు ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. కానీ అక్రమ రీతిలో ట్రంప్ అనేక డాక్యుమెంట్లను ఇంటికి తరలించి చించివేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రికార్డులను భద్రపరిచే చట్టాలను ట్రంప్ అతిక్రమించినట్లు నేషనల్ ఆర్కీవ్స్ పేర్కొన్నది.