Thailand : థాయ్‌లాండ్ రాజు కుమార్తె, యువరాణి బజ్రకితియభ మహిదోల్ గతవారం పార్కులో పరుగెత్తుతుండగా గుండెపోటుతో కుప్పకూలిన విషయం తెలిసిందే. సీపీఆర్ చేసినా కూడా ఆమెలో స్పందన లేకపోవడంతో ఎడ్మ్మా ద్వారా ఆక్సిజన్ అందించి, బ్యాంకాక్‌ని ఆస్పత్రికి తరలించారు. దాంతో, ఆ రోజు నుంచి ఆమె ఆరోగ్యం ఎలా ఉందనే ఆందోళన థాయ్ ప్రజల్లో మొదలైంది. అయితే.. బజ్రకితియభ లైఫ్ సపోర్టింగ్ సిస్టంతో ఇప్పటికి ప్రాణాలతో ఉన్నారట. ఈ విషయాన్ని థాయ్‌లాండ్ రాజకుటుంబం సోమవారం వెల్లడించింది. ‘యువరాణి గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలకు వైద్యులు లైఫ్ సపోర్టింగ్ అందిస్తున్నారు. ఆమె ఆరోగ్యం ఒక దశలో నిలకడగా ఉంద’ని రాజ కుటుంబం ఒక ప్రకటన చేసింది. రాజకుమారి గుండె కొట్టుకోవడాన్ని మందులతో కంట్రోల్ చేస్తున్నారు. అయితే సిస్టోల్ మాత్రం సరిగ్గా జరగడం లేదని ఆ ప్రకటనలో చెప్పారు.
థాయ్‌లాండ్ రాజు వజిరలాంగ్‌కార్న్ పెద్ద కుమార్తె అయిన బజ్రకితియభకు ప్రస్తుతం 44 ఏళ్లు. రాజుకు మొదటి భార్య ద్వారా కలిగిన ఏకైక సంతానం ఆమె. థాయ్‌లాండ్‌కు తర్వాత కాబోయే యువరాణి ఆమెనే. దాంతో ఆమెను అందరూ ప్రిన్సెస్ బా అని పిలుస్తారు. నఖాన్ రట్ఛసిమ పార్కులో సైనిక శునకాలకు శిక్షణ ఇస్తూ.. పరుగెత్తుతుండగా ఆమెకు గుండెపోటు వచ్చింది. దాంతో ఆమె అక్కడే కుప్పకూలిపోయింది. ఆమెకు గంటపాటు సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. దాంతో, రాజు వెంటనే అక్కడికి చేరుకొన్నారు. ఆమెకు ఆక్సిజన్ అందించి మిలిటరీ హెలికాప్టర్లో ఆస్పత్రికి తరలించారు.