బ్రస్సెల్స్, ఏప్రిల్ 27: ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాలకు అంతరాయం కలిగిస్తుండడంతో ఇంధన సంక్షోభంలో యూరప్ దేశాలు చిక్కుకున్నాయి. దీంతో ఇంధన ధరలు పెరిగి ఐరోపా ఖండంవ్యాప్తంగా కొరత భయాలను రేకెత్తిస్తున్నది. 2022 రష్యా-ఉక్రెయిన్ ఇంధన సంక్షోభం తదనంతర పరిణామాల నుంచి ఆ ప్రాంతం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో తాజా సంక్షోభం ఏర్పడింది. కేవలం నాలుగేండ్లలో రెండవ ప్రధాన ఇంధన సంక్షోభంగా యూరోపియన్ అధికారులు ప్రస్తుత సంక్షోభాన్ని అభివర్ణిస్తున్నారు.
సరఫరా అంతరాయం
యుద్ధ ప్రభావం ఇంధన ప్రవాహాలపై తీవ్రంగా పడింది. ముఖ్యంగా హొర్ముజ్ జలసంధి గుండా జరిగే చమురు, సహజ వాయువు సరఫరాలకు ఏర్పడిన అంతరాయం ప్రపంచవ్యాప్తంగా ప్రభావాన్ని చూపుతున్నాయి. దిగుమతి చేసుకునే శిలాజ ఇంధనాలపై ఎక్కువగా ఆధారపడిన యూరప్ ప్రత్యేకంగా దీని వల్ల తీవ్రంగా దెబ్బతిన్నది. కీలకమైన ఎల్ఎన్జీ సరఫరాల నిలిపివేత, రవాణా తగ్గడం వల్ల మార్కెట్లు దెబ్బతిని చమురు, గ్యాస్ ధరలు అస్థిరతకు లోనయ్యాయి. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి యూరప్‌వ్యాప్తంగా ఇంధన ధరలు విపరీతంగా పెరిగాయి. తొలి దశలో 60 శాతం మేరకు ఎల్ఎన్జీ ధరలు పెరుగగా చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లు దాటి దాని ప్రభావం గృహాలు, పరిశ్రమలను ఒత్తిడికి గురిచేసింది. యూరోపియన్ యూనియన్ ఇప్పటికే చమురు, గ్యాస్ దిగుమతుల కోసం అదనంగా 3,200 కోట్ల డాలర్లను భరించింది. ఇది ఆర్థిక భారం తీవ్రతను స్పష్టం చేస్తున్నది. పెరిగిన ఇంధన ధరలు ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోస్తున్నాయి. దీంతో దీర్ఘకాలిక ఆర్థిక అస్థిరత భయాల నేపథ్యంలో జీ7 ఆర్థిక వ్యవస్థల్లోని కేంద్ర బ్యాంకులు జాగ్రత్త వైఖరిని అవలంబిస్తున్నాయి.
ప్రపంచంపై ప్రభావం
ఇరాన్ యుద్ధ ప్రభావం ఐరోపాకే పరిమితం కాలేదు. పెరుగుతున్న ఇంధన ధరలు ప్రపంచ ద్రవ్యోల్బణానికి, ఆర్థిక అనిశ్చితికి దారితీస్తున్నాయి. ఈ ఘర్షణలు కొనసాగితే ప్రపంచ వృద్ధికి విస్తృత ముప్పు వాటిల్లుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అత్యవసర చర్యలు స్వల్పకాలిక ఉపశమనాన్ని అందించినప్పటికీ ఈ సంక్షోభం ఎంతకాలం కొనసాగుతుందనేది పశ్చిమాసియాలోని భౌగోళిక రాజకీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుందని వారు చెప్తున్నారు. ఐరోపాకు ప్రస్తుత పరిస్థితి స్పష్టమైన హెచ్చరికగా నిలుస్తుంది.