Israel vs Lebanon : దక్షిణ లెబనాన్ (South Lebanon) లోని బ్యూఫోర్ట్ క్యాజిల్ () ను ఇజ్రాయెల్‌కు చెందిన గోలానీ బ్రిగేడ్ దళాలు స్వాధీనం చేసుకొన్నాయి. అనంతరం బ్యూఫోర్ట్ క్యాజిల్పై ఇజ్రాయెల్ పతాకాలను ఎగురవేశాయి. 1982లో లెబనాన్‌తో తొలి యుద్ధంలో ఇజ్రాయెల్ దళాలు ఈ కోటను మొదటిసారి స్వాధీనం చేసుకొన్నాయి. అప్పుడు కూడా గోలానీ బ్రిగేడ్ దళాలే పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ దళాలతో పోరాడి కోటను ఆక్రమించాయి. నాటి నుంచి 2000 సంవత్సరం వరకు ఈ కోట ఇజ్రాయెల్ ఆధీనంలోనే ఉంది.
ఆ తర్వాత లెబనాన్ ఆధీనంలోకి వచ్చింది. తాజాగా ఇజ్రాయెల్‌పై హమాస్ దళాలు భారీగా దాడులు చేసిన మర్నాడే తిరిగి ఈ కోటను ఐడీఎఫ్ స్వాధీనం చేసుకుంది. దక్షిణ లెబనాన్, ఉత్తర ఇజ్రాయెల్‌పై నిఘా పెట్టడానికి ఈ కోట అత్యంత వ్యూహాత్మక ప్రదేశం. ఈ ప్రాంతంలోని రాకెట్ లాంచింగ్ వ్యవస్థలపై తాము దృష్టి పెట్టబోతున్నట్లు ఇజ్రాయెల్ బలగాలు వెల్లడించాయి. ‘బ్యాటిల్ ఆఫ్ బ్యూఫోర్ట్’ ముగిసిన 44 ఏళ్ల తర్వాత ఇజ్రాయెలీ దళాలు తిరిగి ఆ కోటపై పతాకాలను ఎగురవేశాయని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ ప్రకటించారు.
ఈ కోటను స్వాధీనం చేసుకోవడానికి యుద్ధ విమానాల సాయంతో ఇజ్రాయెల్ దళాలు భారీ ఎత్తున బాంబింగ్ నిర్వహించాయి. అదేవిధంగా భూతల పోరాటం కూడా చేశాయి. చివరకు కోటను దక్కించుకున్నాయి.