Russian oil : ఒకపక్క రష్యా నుంచి చమురు దిగుమతులపై ఆంక్షలు ఉన్నప్పటికీ ఇండియా ఏమాత్రం వెనుకాడటం లేదు. రష్యా నుంచి చమురు దిగుమతుల్ని పెంచుకుంటూ వస్తోంది. ఈ నెలలో రష్యా నుంచి ఇండియా చమురు దిగుమతులు 39 శాతం పెరిగాయి. మారిటైమ్ అండ్ కమోడిటీ ఇంటెలిజెన్స్ సంస్థ కెప్లర్ నివేదిక ప్రకారం.. ఇటీవలి కాలంలో రష్యాతోపాటు యూఏఈ నుంచి కూడా ఇండియా అత్యధికంగా చమురు కొంటోంది. ఈ జూన్ 1 నుంచి 19 వరకు రష్యా నుంచి సగటున రోజుకు 2.66 మిలియన్ బ్యారెళ్ల చమురు కొన్నది.
మే నెలలో సగటున రోజుకు 1.91 మిలియన్ బ్యారెల్స్ మాత్రమే కొనుగోలు చేసింది. అంటే ఈ నెలలో దాదాపు 39 శాతం ఎక్కువ చమురు కొంటోంది. ప్రస్తుతం ఇండియాకు అత్యధికంగా చమురు సరఫరా చేస్తోంది రష్యానే. ఇదే సమయంలో యూఏఈ నుంచి కూడా చమురు దిగుమతులు ఎక్కువగానే ఉంటున్నాయి. అయితే, గత నెలతో పోలిస్తే స్వల్పంగా సరఫరా తగ్గింది. మేలో సగటున రోజుకు 644,000 బ్యారెళ్ల చమురును యూఏఈ నుంచి దిగుమతి చేసుకోగా.. ఈ నెలలో మాత్రం 636,000 బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంటోంది. ఇటీవలి కాలంలో వెనెజులా నుంచి భారత్ అధికంగా చమురు కొంటోంది. మనకు అత్యధిక చమురు అందిస్తున్న నాలుగో దేశంగా వెనెజులా నిలిచింది. ఈ దేశం నుంచి సగటున రోజుకు 209,000 బ్యారెళ్ల చమురు దిగుమతి అవుతోంది. సౌదీ అరేబియా నుంచి కూడా రోజుకు 384,000 బ్యారెళ్ల చమురు దిగుమతి అవుతోంది. మరోవైపు అమెరికా నుంచి చమురు దిగుమతులు భారీగా తగ్గించింది ఇండియా.
గత నెలలో అమెరికా నుంచి సగటున రోజుకు 252,000 బ్యారెళ్ల చమురు దిగుమతి కాగా.. ఈ నెలలో రోజుకు 91,000 బ్యారెళ్ల చమురు మాత్రమే దిగుమతి చేసుకుంటోంది. రష్యా చమురు తక్కువ ధరకు లభిస్తుండటమే అత్యధిక దిగుమతులకు కారణం. ప్రపంచంలోనే ఆయిల్ అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న మూడో దేశం ఇండియా. క్రూడాయిల్, ఎల్ఎన్జీ, ఎల్పీజీ సహా చమురును ఎక్కువగా విదేశాల నుంచే దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఇటీవలి కాలంలో చమురు దిగుమతుల విషయంలో ఇండియా ఇబ్బందులు ఎదుర్కొంది. హార్ముజ్ జలసంధిని ఇరాన్, అమెరికా మూసి వేయడంతో ఈ పరిస్తితి తలెత్తింది. ఇప్పుడు యుద్ధం ముగియడం, హార్ముజ్ తెరుచుకోవడంతో ఇండియాలో చమురు కొరత తీరే అవకాశం ఉంది.