ఎట్టి పరిస్థితుల్లోనూ అవిశ్వాస తీర్మానం అనే.. అంశమే దగ్గరికి రాకుండా పాక్ ప్రధాని ఇమ్రాన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రయత్నాలతో పాటు ఆయన ప్రతిపక్షం ముందు 3 షరతులను కూడా విధించారు. అందులో మొదటి షరతు… పదవి కోల్పోయిన తర్వాత తనను ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేయకూడదు. ఎన్బీఏ కింద తనను అరెస్ట్ చేయకూడదన్నది రెండో షరతు. విపక్ష నేత షహబాజ్ షరీఫ్‌ను తదుపరి ప్రధానిగా చేయకూడదన్నది ఇమ్రాన్ మూడో షరతు. అయితే విపక్షాలు మాత్రం ఈ షరతులపై ఎలాంటి స్పందనా వ్యక్తం చేయకపోవడం గమనార్హం.
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇవాళ రాత్రి 8 గంటల తర్వాత అవిశ్వాసంపై ఓటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. తొలుత ఇవాళ ఉదయం సభ మధ్యాహ్నం వాయిదా పడింది. మళ్లీ మధ్యాహ్నం 2.30 నిమిషాల తర్వాత సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి ప్రసంగిస్తున్నారు. ఇవాళ రాత్రి ఇఫ్తార్ విందు ముగిసిన తర్వాత అవిశ్వాసంపై ఓటింగ్ జరిగే అవకాశాలు ఉన్నట్లు కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది.