Mojtaba Khamenei : ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా ఎన్నికైన మొజ్తాబా ఖమేని ఆచూకీ, ఇతర వివరాలకు సంబంధించి అనేక అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం అతడికి సంబంధించి తాజాగా ఒక వీడియోను విడుదల చేసింది. ఇరాన్‌కు చెందిన అధికార మీడియా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్‌కాస్టింగ్ (ఐఆర్ఐబీ) సంస్థ 1.19 నిమిషాల నిడివిగల వీడియోను ఎక్స్‌లో రిలీజ్ చేసింది.
ఇందులో మొజ్తాబా, కొందరు స్కాలర్స్‌కు రిలీజియస్ సైన్స్ అనే సబ్జెక్ట్‌కు సంబంధించిన పాఠాల్ని అరబిక్ భాషలో బోధిస్తున్నారు. అయితే, ఈ వీడియో ఎప్పటిది అనే విషయంలో స్పష్టత లేదు. ఇరాన్ యుద్ధం ప్రారంభమై, అయతొల్లా ఖమేని, అతడి కుటుంబం మరణించిన తర్వాత నుంచి ఇప్పటివరకు మొజ్తాబా బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. ఆయనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు కూడా విడుదల కాలేదు. ఆయన ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఎంపికైన తర్వాత కూడా అతడి ఆచూకీ తెలియలేదు. కానీ, ఇంతకాలానికి ఒక వీడియోను ఇరాన్ విడుదల చేయడం ఆసక్తికరంగా మారింది. నిజానికి మొజ్తాబా ఎక్కడ ఉన్నాడు అనే విషయంలో క్లారిటీ లేదు. ఆయన అసలు బతికే ఉన్నారా.. ఆరోగ్యంగా ఉన్నారా.. లేక గాయపడ్డారా.. ఇరాన్‌లోనే ఉన్నారా.. ఇలా అనేక అనుమానాలు తలెత్తాయి.
🚨 Published for the first time
A video of religious science teaching by Ayatollah Mojtaba Khamenei pic.twitter.com/uFtIvZ0POy
— IRIB (Islamic Republic of Iran Broadcasting) (@iribnews_irib) March 19, 2026
దీనిపై ఇరాన్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా తనకు అతడి ఆచూకీ గురించి ఎలాంటి వివరాలు తెలియవన్నాడు. మొజ్తాబా బతికే ఉన్నాడో లేదో కూడా తెలీదన్నాడు. అయితే, ఇజ్రాయెల్ దాడుల్లో మొజ్తాబా గాయపడ్డాడని, అతడికి మాస్కోలో రహస్యంగా చికిత్స జరుగుతోందని ఒక ప్రచారం మొదలైంది. ఇలాంటి సమయంలో అతడి వీడియో విడుదలైనప్పటికీ అది పాత వీడియో కావొచ్చని విశ్లేషకులు అంటున్నారు.