హైటెక్ సిగలో..గులాబీ గుబాళింపు

- స్వచ్ఛందంగా తరలివచ్చిన అభిమానులు
- అధ్యక్షుడిగా తొమ్మిదోసారి సీఎం కేసీఆర్.. మిన్నంటిన హర్షాతిరేకాలు
- పాసులు ఉన్నవారికే సభలోకి అనుమతి
- ప్రవేశ ద్వారం వద్ద స్క్రీన్లలో సభను తిలకిస్తూ.. కేరింతలు
- ప్రజలే మా బాస్‌లు అనగానే.. హోరెత్తిన నినాదాలు
- సీఎం ప్రసంగం మరింత ఆత్మవిశ్వాసం పెంచిందన్న నేతలు
- 1500 చిత్రాలతో ఆకట్టుకున్న ఫొటో ఎగ్జిబిషన్
సిటీబ్యూరో, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ ) : బహిరంగ సభలు, సమావేశాలకు టీఆర్ఎస్ పార్టీ పెట్టింది పేరు. సందర్భం ఏదైనా ప్రాంగణ వేదిక కిక్కిరిసిపోవాల్సిందే. ప్రాంతమంతా గులాబీ మాయం కావాల్సిందే. ఇదంతా ఒక ఎత్తయితే.. అందరి దృష్టి సీఎం కేసీఆర్ ప్రసంగం వైపే ఉంటుంది. ద్విదశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి సోమవారం హెచ్ఐసీసీ వేదికగా నిర్వహించిన ప్లీనరీ అంగరంగ వైభవంగా జరిగింది.
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్లు, జడ్పీ చైర్మన్లు, మండల పరిషత్ అధ్యక్షులు, జడ్పీటీసీ సభ్యులు, కార్పొరేటర్లకు మాత్రమే ఆహ్వానం ఉన్నప్పటికీ సభ ప్రాంగణానికి స్వచ్ఛందంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. పాసులు ఉన్నవారినే సభ ప్రాంగణంలోకి అనుమతించడంతో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు బయటకే ఉండిపోయారు. ప్రవేశ ద్వారం ముందు ఏర్పాటు చేసిన స్క్రీన్ల వద్ద సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని ఆసక్తిగా తిలకించారు.
తెలంగాణ పథకాలు తమకు కావాలని ఆంధ్రా ప్రజలు కోరుకుంటున్నారని, ఏపీలో టీఆర్ఎస్ పార్టీ పెట్టాలన్న డిమాండ్ వస్తుందని సీఎం కేసీఆర్ అనగానే చప్పట్లు మార్మోగాయి. బీజేపీ-కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సిట్ అంటే సిట్-పట్ అంటే పట్ అని , టీఆర్ఎస్కు అధిష్టానం లేదని, తెలంగాణ ప్రజలే బాస్‌లు అని సీఎం కేసీఆర్ అనడంతో జై తెలంగాణ నినాదాలు హోరెత్తాయి. కాగా పార్టీ అధినేతగా కేసీఆర్‌ను తొమ్మిదవ సారి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. దీంతో పాటు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రసంగంతో మరింత ఆత్మ విశ్వాసం పెరిగిందని, రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంతో పనిచేస్తామని శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఫొటో ఎగ్జిబిషన్లో20ఏళ్ల ప్రస్థానం
సభ ప్రాంగణానికి వెళ్లే ప్రధాన మార్గంలో కుడివైపున కాకతీయ ఇన్నోవేటివ్ సంస్థ బందూక్ లక్ష్మణ్ మురారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ప్రత్యేకతను చాటుకున్నది. 20 ఏళ్ల గులాబీ పార్టీ ప్రస్థానాన్ని ‘టీఆర్ఎస్ కాన్సెప్ట్’ పేరిట ఫొటో ఎగ్జిబిషన్లో 1500 ఫొటోలు ప్రదర్శనలో పెట్టారు. టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం 2001 నుంచి 2021 నేటి వరకు ఉద్యమ జ్ఞాపకాలు, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ఫొటోలు, పెయింటింగ్ రూపంలో ప్రదర్శించారు. ఉద్యమ ఘట్టాలు, రాష్ట్ర సాధన, అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రదర్శనలో ఉంచిన ఫొటో ఎగ్జిబిషన్‌ను అతిథులు ఆసక్తిగా తిలకించారు.
27 ఏఫ్రిల్ 2001 జలదృశ్యంలో పార్టీ ఆవిర్భావ సమయంలో కేసీఆర్ ప్రసంగిస్తున్న చిత్రాలు, చింతమడకలో కేసీఆర్ ఉపాధ్యాయ దినోత్సవం రోజున టీచర్లతో కలిసి దిగిన ఫొటో, ఆ స్కూల్లో కేసీఆర్ చదువుకునే రోజుల్లో రూల్ నంబరు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన అరుదైన చిత్రాలు, మంత్రి కేటీఆర్ బాల్యం ఫొటోలను తిలకించేందుకు క్యూ కట్టారు. తమకు ఇష్టమైన ఫొటోల వద్ద సెల్ఫీలు, గ్రూపు ఫొటోలు తీసుకుని సందడి చేశారు. కరువు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ పచ్చని పొలాలుగా మార్చిన తీరు వంటి చిత్రాలు అందరినీ ఆకర్షించాయని టీఆర్ఎస్ నాయకుడు సుధీర్ తెలిపారు.
చూడముచ్చటగా సభా ప్రాంగణం
కాళేశ్వరం ప్రాజెక్టు, కాకతీయ కళాతోరణం, హైదరాబాద్ ఐకానిక్ ప్రాజెక్టు దుర్గం చెరువుల థీమ్‌తో సభ ప్రాంగణం ఎల్ఈడీ ధగధగలతో కనువిందు చేసింది. 112 అడుగుల వెడల్పు, 80 అడుగుల మేర ఎత్తులో సభ వేదిక ఉండగా.. 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో సభ ప్రాంగణంను చూడముచ్చటగా తీర్చిదిద్దారు. జెండాలు, గులాబీ తోరణాలతో గులాబీ తోటను తలపించింది. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా సభ ప్రాంగణంలో 8 అడుగులకు ఒకరు చొప్పున 6500 మంది సౌకర్యవంతంగా కూర్చునేలా చేశారు. సభ వేదికపై సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, కార్యవర్గ సభ్యులు కలిపి 100 మంది కూర్చునేందుకు వీలుగా సభ వేదికను ఏర్పాటు చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

