వెంగళరావునగర్, అక్టోబర్ 8 : నిరుద్యోగ యువతకు పోలీసులు మార్గదర్శనం చేశారు. కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించేందుకు పేద కుటుంబాలకు చెందిన యువతకు ఆ పోలీసు ఇన్స్పెక్టర్ ఎంతగానో ప్రోత్సహించారు. కృషి, పట్టుదల, దృఢ సంకల్పం ఉంటే విజయం సాధించవచ్చని నిరూపించారు. ఎన్‌ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్లో అప్పటి ఇన్స్పెక్టర్ సైదులు యువతకు శిక్షణ ఇప్పించి మెరికల్లా తీర్చిదిద్దారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా సమాజ సేవలో భాగంగా ఈ బృహత్తర కార్యక్రమాన్ని తన భుజాన వేసుకున్నారు. తమ ప్రాంతంలోని నిరుపేద కుటుంబాలకు చెందిన ఉద్యోగార్ధులను సమీకరించి బోధించారు.
శిక్షణ కేంద్రంగా ఎస్ఆర్నగర్ పీఎస్
పోలీస్ స్టేషన్ శిక్షణ కేంద్రంగా మారింది. ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్‌లోని మూడవ అంతస్తులో కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ ఇప్పించారు. ఎస్ఐలు, కానిస్టేబుళ్లతో మెళుకువలు చెప్పించారు. పరీక్షలు ఎలా ఉంటాయి. ప్రశ్నా పత్రాల్లో మంచి మార్కులు ఎలా సాధించాలి, శారీరక ఫిట్ నెస్, రన్నింగ్, జంపింగ్ వంటి ఎన్నో అంశాల్లో బోధించిన తీరు నిరుద్యోగ యువతకు దిశానిర్దేశం చేసింది. ప్రణాళికాబద్దంగా క్లాసులు చెప్పి ఉద్యోగ అభ్యర్థులను రాటుదేలేలా చేశారు. పోలీసుల శ్రమ ఊరికే పోలేదు. ఇన్స్పెక్టర్ సైదులు ప్రోత్సా హం.. విద్యార్థుల కృషితో ఇప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించగలిగారు.
పోలీస్ అవ్వడానికి పేదరికం అడ్డుకాలేదు
పోలీస్ అవ్వడానికి పేదరికం అడ్డుకాదని నిరూపించారు. 23మంది అభ్యర్థులు శిక్షణ పొందగా.. రిలో 12 మంది కానిస్టేబుల్ ఉద్యోగానికి సెలక్ట్ అయ్యారు. అప్పటి ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ సైదులు ప్రోత్సాహంతోనే ఈ ఉద్యోగం పొందగలిగామని తెలుపుతున్నారు. పోలీస్ అధికారులు చెప్పిన ఈవెంట్స్ ఎంతగానో ఉపయోగపడ్డాయని చెప్పారు. ఉద్యోగాలు సాధించిన యువకులు వారి కుటుంబ సభ్యులతో కలిసి సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి చేరుకొని ఇన్స్పెక్టర్ సైదులుకు కృతజ్ఞతలు తెలిపారు.
వారు చెప్పిన క్లాసులతోనే ఉద్యోగం
మోతీనగర్ హమాలీ బస్తీకి చెందిన రవితేజది నిరుపేద కుటుంబం. తండ్రి శ్రీనివాస్ రోజువారి కూలి. తల్లి టైలరింగ్ చేస్తుంది. కానిస్టేబుల్ పోటీ పరీక్షలకు ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్లో కోచింగ్ ఇస్తున్నారనే విషయం స్నేహితుల ద్వారా తెలుసుకొని అక్కడికి వెళ్లాను. డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతూనే కానిస్టేబుల్ పరీక్షలకు పోలీస్ స్టేషన్లో ప్రిపేర్ అయ్యాను. ఇన్స్పెక్టర్ సైదులు, ఎస్ఐ.లు, కానిస్టేబుళ్లు చెప్పిన క్లాసులు ఉద్యోగం రావడానికి కారణం అయ్యాయి.
– జి.రవితేజ, హమాలీ బస్తీ, మోతీనగర్
సీఐ సైదులు మా జీవితాల్లో వెలుగులు నింపారు
ఇన్స్పెక్టర్ సైదులు మా జీవితాల్లో వెలుగులు నింపారు. పేదరికంతో ఉన్న యువతకు దారి చూపాలని ఎంతో శ్రద్ద పెట్టేవారు. బాగా చదువుకొని పరీక్షలకు సిద్ధమయ్యేలా మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు. పోలీసుల కోచింగ్‌తో ఇప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాను. నాన్న లేని లోటు రానివ్వకుండా అమ్మ అన్నీ తానై పెంచింది. అమ్మ కష్టాలు తీర్చాలనే పట్టుదలతో కానిస్టేబుల్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యాను. ఉద్యోగం సాధించాను. అమ్మ కష్టాలు తీరుస్తా.
– ఎండీ.హనీఫ్, వెంకటగిరి, యూసుఫ్‌గూడ, పోలీస్ కానిస్టేబుల్
పేద విద్యార్థులను ఎంపిక చేసి కోచింగ్ ఇచ్చాం
ఏడాది కిందట కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. అప్పుడు నేను ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నా. మా ప్రాంతంలోని పేద కుటుంబాలకు చెందిన ఉద్యోగార్థులను సమీకరించాను. చాలామందికి సింగిల్ పేరెంటే ఉన్నారు. తండ్రి ఉంటే తల్లి లేరు. తల్లి ఉంటే తండ్రి లేని కుటుంబాలకు చెందిన నిరుపేద కుటుంబాల్లోని చదువుపై ఆసక్తి చూపే వారితో మాట్లాడాను. పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు అవసరమైన కోచింగ్‌ను ఉచితంగా ఇస్తామని చెప్పా. ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్‌లోని మూడవ అంతస్తును లెర్నింగ్ స్కూల్‌గా మార్చాను. నాతో పాటు ఎస్ఐ.లు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు అంతా క్లాసులు చెప్పారు. మేమిచ్చిన కోచింగ్‌తో 12మంది కానిస్టేబుళ్లుగా ఉద్యోగాలు సాధించడంతో నాకు చాలా సంతోషంగా ఉంది. నా సొంత పిల్లలే ఉద్యోగాలు సాధించినంత ఆనందంగా ఉంది.
– సైదులు, నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్, ఇన్స్పెక్టర్