సిటీబ్యూరో, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇంజినీర్-ఇన్-చీఫ్ భాస్కర్‌రెడ్డిపై ఎట్టకేలకు సర్కార్ వేటు వేసింది. అడ్డదారిలో ఈఎన్సీ పదవి పొందడంతో పాటు ఇంజనీర్ల పదోన్నతులు, బదిలీలలో భాస్కర్‌రెడ్డి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వరకు ఇంజనీర్ల అసోసియేషన్ ప్రతినిధులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలోనే ‘ఇదేమి భాస్కరా’ అనే శీర్షికన భాస్కర్‌రెడ్డి తీసుకుంటున్న విధానాలను ఎండగడుతూ ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. వరుస ఫిర్యాదుల నేపథ్యంలో భాస్కర్‌రెడ్డిని ఈఎన్సీ బాధ్యతల నుంచి తొలగిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
హెచ్ఎంఆర్ఎల్ సీఈగా భాస్కర్‌రెడ్డిని నియమించగా..పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ ఈఎన్సీగా సాయప్పరెడ్డికి బాధ్యతలు అప్పగించింది. ఐతే సాయప్ప రెడ్డి కంటే సీనియర్ ఇంజినీర్లు జ్యోతిర్మయి, శ్రీలక్ష్మి ఉన్నప్పటికీ సాయప్పరెడ్డిని ఈఎన్సీగా ఖరారు చేయడం పట్ల ఇంజినీర్లు పెదవి విరుస్తుండటం గమనార్హం. వివాదాస్పద నిర్ణయాలతో భాస్కర్‌రెడ్డి తరచూ వార్తల్లోకి ఎక్కారు. ఇటీవల కాలంలో ఈఈల బదిలీలలో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. సర్వీసులో భాగంగా 2010 నాటి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ సీనియారిటీ జాబితాను ప్రాతిపదికగా చూపి, తనకంటే సీనియరె్లైన అధికారులను దాటవేసి భాసర్ రెడ్డి పదవులు పొందారు. సూపరింటెండింగ్ ఇంజినీర్‌గా పదోన్నతి పొందిన తర్వాత, 2018 జీఓ ఎంఎస్ నం.68 ప్రకారం అతని కంటే సీనియారిటీలో ముందున్న ఏ.సహదేవ రత్నాకర్, ఎస్.ప్రవీణ్ చంద్ర, దత్తుపంత్, బి.విశ్వనాథరాజు వంటి అధికారుల వివరాలను తొకిపెట్టి అడ్డదారిలో ఈఎన్సీ పదవి దక్కించుకున్నారు.
2010 నాటి డీఈఈ సీనియారిటీ జాబితా హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం సమీక్షలో ఉందనే విషయాన్ని తెలిసి కూడా శాఖాపరమైన అధికారులు భాసర్ రెడ్డి సిఫార్సులను ఆమోదించడంపై అప్పట్లో అరోపణలు వచ్చాయి. అంతేకాకుండా కీలకమైన ఫుల్ అడిషనల్ ఛార్జ్ (ఎఫ్ఏసీ) అరేంజ్మెంట్స్లో పారదర్శకత లేకపోవడం వల్ల ఇతర అధికారుల ప్రమోషన్లకు తీవ్ర విఘాతం కలుగుతోందని, దీనిపై స్పష్టమైన, పారదర్శకమైన విధానాన్ని తీసుకురావాలని అసోసియేషన్ ప్రతినిధులు 2 రోజుల క్రితం సీఎస్‌కు కలిసి వివరించడం, ఈ నేపథ్యంలోనే భాస్కర్‌రెడ్డిని ఈఎన్సీ బాధ్యతల నుంచి తప్పించడం విశేషం. కాగా భాస్కర్‌రెడ్డిపై బదిలీ వేటు వేయడం పట్ల ట్రై కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) ఇంజినీర్లలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.