సిటీబ్యూరో, జూన్ 30 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న హెల్త్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత నాలుగు నెలలుగా జీతాలు రాకపోవడంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురొంటున్నారు. హెల్త్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లకు వెంటనే జీతాలు చెల్లించాలంటూ గతంలోనే సీఎంఓహెచ్ (చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ )జోనల్ కార్యాలయం నుంచి అన్ని డిప్యూటీ కమిషనర్ కార్యాలయాలకు స్పష్టమైన సర్యులర్ జారీచేశారు.
ఐతే ఈ సర్యులర్ను సదరు ‘కోన’ ఏజెన్సీ ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం. అధికారులు ఆదేశాలు ఇచ్చినా ఏజెన్సీ మొండివైఖరి వీడకపోవడంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ కమిషనర్ నుంచి ఎక్స్టెన్షన్ (గడువు పెంపు) ఆర్డర్ తెచ్చి ఇచ్చాం. అయినా సరే, మళ్లీ కమిషనర్ నుంచే కొత్తగా ఎక్స్టెన్షన్ తేవాలంటూ ఏజెన్సీ నిర్వాహకులు మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధిత ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒకసారి కమిషనర్ నుంచి అనుమతి తెచ్చినప్పటికీ, ఏజెన్సీ యాజమాన్యం కావాలనే కొత్త సాకులు వెతుకుతూ కాలయాపన చేస్తోందని సిబ్బంది వాపోతున్నారు. ఉన్నతాధికారుల ఉత్తర్వులను సైతం బేఖాతరు చేస్తూ, తమ పొట్ట కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా బల్దియా సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్న తమపై ఏజెన్సీ నిర్వాహకులు కక్షసాధింపు ధోరణి వీడాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.