వెంగళరావునగర్, మార్చి 7 : పుట్టింటి ప్రేమకు ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ వైదికైంది. సరిగ్గా అలాంటి అపురూపమైన కానుక మహిళా పోలీసులకు లభించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్.ఆర్ నగర్ పోలీసు స్టేషన్లో పని చేస్తున్న మహిళా కానిస్టేబుళ్లు, ఏ.ఎస్సై, హోంగార్డులకు ఇన్స్పెక్టర్ సైదులు మంగళవారం పట్టుచీరలను కానుకగా అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మహిళల్ని గౌరవించడం మన సంప్రదాయమన్నారు. కేసులు, దర్యాప్తుల్లో తీరిక లేకుండా పనిచేస్తున్న మహిళా సిబ్బందికి కాస్తంత అనురాగం, ఆప్యాయతల్ని పంచాలనే ఉద్దేశంతో కానుకగా పట్టు చీరలు అందజేశామని తెలిపారు. మహిళా సిబ్బంది ముఖాల్లో చిరునవ్వు చూడటం తనకెంతో సంతోషంగా ఉందన్నారు.