మెట్రో విడిచి పీఆర్టీఎస్ సాము!
ప్రతిష్ఠాత్మకమైన హైదరాబాద్ మెట్రో విస్తరణపై కాంగ్రెస్ సర్కారు చేతులెత్తేసిందా? మెట్రో మొదటి దశను టేకోవర్‌పై అనాలోచితంగా.. దూకుడుగా వ్యవహరించిన రేవంత్ ప్రభుత్వ పరిస్థితి ఇప్పుడు ‘ముందు నుయ్యి..
- మెట్రో రైలు విస్తరణపై సర్కారు చేతులెత్తేసినట్లేనా?
- ఎనిమిది ప్రాంతాల్లో పీఆర్‌టీఎస్‌పై సర్వే
- మొదటి దశలో 34.46 కిలోమీటర్ల లీ అసోసియేట్స్ అధ్యయనం
- కిలోమీటరుకు రూ.419 కోట్ల చొప్పున రూ.13వేల కోట్ల అంచనా వ్యయం
- పీఆర్‌టీఎస్‌పై మెట్రో కంటే కిలోమీటర్‌కు అదనంగా రూ.50 కోట్ల వ్యయం
- మెట్రో మొదటి దశ టేకోవర్‌పై కొనసాగుతున్న రోజుకు రూ.2 కోట్ల భారం
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ)..ప్రతిష్ఠాత్మకమైన హైదరాబాద్ మెట్రో విస్తరణపై కాంగ్రెస్ సర్కారు చేతులెత్తేసిందా? మెట్రో మొదటి దశను టేకోవర్‌పై అనాలోచితంగా.. దూకుడుగా వ్యవహరించిన రేవంత్ ప్రభుత్వ పరిస్థితి ఇప్పుడు ‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి’లా తయారైందా? కేంద్రం మొదటి దశ-విస్తరణ ప్రాజెక్టుకు లింకు పెట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం దిక్కుతోచని పరిస్థితిలో చిక్కుకుందా? మూడు సంవత్సరాలైనా మెట్రో విస్తరణ కొలిక్కి రాకపోవడంతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించిందా?..ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశంతో లీ అసోసియేట్స్ అధ్యయనంతో రూపొందించిన పీఆర్టీఎస్ (పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టం) నివేదికను పరిశీలిస్తే ఇవన్నీ అవుననే సమాధానమే వినిపిస్తుంది.
పీఆర్‌టీఎస్‌పై రూపొందించిన పవర్‌పాయింట్ ప్రజంటేషన్ను సైతం సీఎం సమీక్షించినట్లుగా కొన్నిరోజుల కిందట హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) ప్రకటించింది. దీంతో సర్కారు మెట్రో విడిచి పీఆర్టీఎస్ సాము చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లుగా అధికారికవర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా నగరాల్లో రోడ్డుపై ప్రజా రవాణాకంటే వేగం, పర్యావరణహితంలో మెట్రో రైలు ప్రాజెక్టులే మేలంటూ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో ఉన్న మెట్రో విస్తరణ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోలేక అంతకంటే ఎక్కువ వ్యయం, తక్కువ రవాణా సామర్థ్యం ఉన్న పీఆర్టీఎస్ వైపు మళ్లినట్లుగా స్పష్టమవుతుంది. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద పబ్లిక్-ప్రైవేటు-పార్ట్నర్షిప్ మెట్రో ప్రాజెక్టుగా ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ మెట్రో రైలు పరిస్థితి నానాటికి దయనీయంగా తయారవుతుంది. ఎల్అండ్టీ కంపెనీ 68 కిలోమీటర్ల మొదటి దశ ప్రాజెక్టును కష్టమైనా..
నష్టమైనా.. ఒప్పందం మేరకు ముందుకు తీసుకుపోతుంది. ఈ క్రమంలో మెట్రో విస్తరణపై చాకచక్యంగా వ్యవహరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా అడుగులు వేసింది. ముఖ్యంగా కేసీఆర్ హయాంలో పట్టాలెక్కిన రాయదుర్గం ఎయిర్‌పోర్టు మెట్రోను అర్ధాంతరంగా రద్దు చేయడం మొదలు మెట్రో మొదటి దశ టేకోవర్ వరకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అనాలోచితంగానే దూకుడు ప్రదర్శించిందనే విమర్శలు మొదటి నుంచి ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులు, సర్కారు సంకట స్థితిని చూస్తే ఈ విమర్శలు నిజమనే నిర్ధారణకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి మెట్రో విస్తరణ ప్రాజెక్టులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు రూ.46వేల కోట్ల అంచనా వ్యయంతో సుమారు 122 కిలోమీటర్ల ప్రతిపాదనల్ని కేంద్రం ముందు ఉంచింది. డీపీఆర్ పరిశీలనలో భాగంగా కేంద్రం పలు కొర్రీలుగానీ, అభ్యంతరాలుగానీ సందేహాలుగానీ వ్యక్తం చేసినపుడు రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తే బాగుండేదని ఓ రిటైర్డ్ అధికారి తెలిపారు. కానీ అందుకు భిన్నంగా ప్రభుత్వం మొదటి నుంచి ఎల్అండ్టీ కంపెనీతో వ్యక్తిగత వైరం పెట్టుకోవడంతో ఆ కంపెనీ చాకచక్యంగా వ్యవహరించి ప్రభుత్వమే మొదటి దశను టేకోవర్ చేసుకునేలా వ్యూహాన్ని అమలు చేసింది.
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో ఆ వ్యూహం ఫలించి ఏకంగా రూ.13,800 కోట్ల రుణంతో పాటు నిత్యం నష్టాల్లో నడుస్తున్న మెట్రో మొదటి దశను కంపెనీకి అదనంగా రూ.2వేల కోట్ల నగదు ఇచ్చి టేకోవర్ చేసుకునేందుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. పైగా రూ.30వేల కోట్ల ప్రాజెక్టును రూ.15వేల కోట్లకే టేకోవర్ చేశామని, నాలుగు శాతం వడ్డీతో రుణాలు తెచ్చి మొదటి దశను లాభాల్లో పరుగులు పెట్టిస్తామంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి ప్రకటించారు. కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా మారి ఇప్పుడు టేకోవర్ అయోమయంలో పడిపోవడంతో పాటు ఆ ప్రక్రియ జాప్యమవుతున్నందుకుగాను ఎల్అండ్టీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.2 కోట్లు చెల్లించాల్సిన అగత్యం ఏర్పడింది. అయినప్పటికీ అసలు మెట్రో విస్తరణ ప్రాజెక్టు అనుమతులు ఎంతవరకు వచ్చాయి? టేకోవర్ ఎక్కడ ఆగింది? కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రుణ ప్రక్రియను ముగిస్తామంటూ వచ్చిన అంగీకార అమలు ఎప్పటిలోగా పూర్తవుతుంది? ఇవన్నీ శేష ప్రశ్నలుగానే మిగిలిపోయాయి.

తాజాగా తెరపైకి పీఆర్టీఎస్…
మహా నగరవ్యాప్తంగా మెట్రో విస్తరణ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందని అందరూ ఎదురుచూస్తున్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం హఠాత్తుగా పీఆర్టీఎస్ (పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టం)ను తెరపైకి తీసుకురావడం గమనార్హం. కొంతకాలం కిందట లీ అసోసియేట్స్‌తో ఈ ప్రతిపాదనలపై అధ్యయనం కూడా చేయించింది. మొదటి దశలో భాగంగా రాయదుర్గం-కూకట్పల్లి (7.62 కిలోమీటర్లు), రాయదుర్గం-హైటెక్ సిటీ-నాలెడ్జ్ సిటీ (7.62 కిలోమీటర్లు), ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ (14.01 కిలోమీటర్లు) ఇలా 75 చదరపు కిలోమీటర్ల పరిధిలో 34.46 కిలోమీటర్ల మార్గంపై అధ్యయనం జరిగింది. ఇందుకు సుమారు రూ.13వేల కోట్ల వరకు అంచనా వ్యయం అవుతుందని ప్రాథమికంగా లెక్కగట్టినట్లు అధికారులు చెబుతున్నారు. అంటే కిలోమీటరుకు సుమారు రూ.377 కోట్ల వరకు అవుతుంది.
అదేవిధంగా రెండో దశలో భాగంగా సచివాలయం చుట్టుపక్కల పరిధిలో 20 చదరపు కిలోమీటర్ల పరిధిలో కూడా అధ్యయనం చేశారు. సచివాలయం-ఎన్టీఆర్ మార్గ్-ఖైరతాబాద్, లక్డీకాపూల్ మెట్రో స్టేషన్-ఇక్బాల్ మినార్ జంక్షన్ వరకు 17.4 కిలోమీటర్ల మేర ఈ అధ్యయనం జరిగింది. దీనిపై రూపొందించిన పవర్‌పాయింట్ ప్రజంటేషన్ను సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష కూడా చేసినట్లుగా హెచ్ఎంఆర్ఎల్ (హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్) గతంలోనే ఒక ప్రకటనలో తెలిపింది. అయితే మెట్రో రైలుకు ఇది లాస్ట్‌మైల్ కనెక్టివిటిగా అధికారులు పీఆర్‌టీఎస్‌ను అభివర్ణిస్తున్నట్లు తెలిసింది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా మెట్రో రైలు ప్రాజెక్టుల లాస్ట్‌మైల్ కనెక్టివిటీ అనేది సులభతరంగా, అతి తక్కువ ఖర్చుతో ప్రయాణికుడిని గమ్యస్థానానికి అంటే కాలనీ వరకు చేర్చేదిగా ఉండాలని రవాణా రంగ నిపుణులు ఒకరు తెలిపారు. కానీ పీఆర్టీఎస్ అనేది మెట్రో రైలు ప్రాజెక్టులాంటి సమాంతర ప్రాజెక్టు… పైగా అంతకంటే ఎక్కువ వ్యయం అవుతుంది. అలాంటప్పుడు పీఆర్‌టీఎస్‌ను లాస్ట్‌మైల్ కనెక్టివిటీగా అభివర్ణించడం హాస్యాస్పదం అని సదరు నిపుణులు అంటున్నారు.
కేంద్రంతో సంబంధం లేనందుకేనా ఈ తోవ?
కాంగ్రెస్ ప్రభుత్వం అకస్మాత్తుగా మెట్రో విస్తరణ ప్రాజెక్టుపై నుంచి దృష్టిని పీఆర్టీఎస్ వైపు మళ్లించడం వెనుక కారణాలు ఏమిటనే దానిపై చర్చ కొనసాగుతుంది. ముఖ్యంగా తమ హయాంలో ఏదో ఒక ప్రజా రవాణాను చేపట్టామని ప్రజలకు చెప్పుకోవడంలో భాగంగానే దీనిని తెరపైకి తెచ్చారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మెట్రో విస్తరణ ప్రాజెక్టు పట్టాలెక్కాలంటే తొలుత రాష్ట్ర సర్కారు అనాలోచితంగా తీసుకున్న మొదటి దశ టేకోవర్‌ను పూర్తి చేయాలి. ఆ తర్వాత కేంద్రం విస్తరణ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలి. ఇవన్నీ ఒక ఎత్తయితే… మొదటి దశకు రుణాలు తీసుకోవడమే కాదు, విస్తరణ ప్రాజెక్టుకు కూడా రుణాలు అనివార్యమైనందున కనీసంగా రూ.30-40వేల కోట్ల రుణాలు కచ్చితంగా తీసుకోవాల్సిందే. ఈ ప్రక్రియలన్నీ పూర్తవడమనేది కాలయాపనతో కూడుకున్న పనైనందున..
ఈలోగా పీఆర్‌టీఎస్‌ను తెరపైకి తీసుకువచ్చి ప్రజల దృష్టిని అటువైపు మరల్చాలనే వ్యూహం ఉందనే ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా కేంద్రం అనుమతి లేకుండానే పీఆర్టీఎస్ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా చేపట్టే వెసులుబాటు ఉండటమే ఇందుకు కారణంగా పలువురు చెబుతున్నారు. అయితే ఈ వాదనలు ఇలా ఉండగా… మెట్రో ప్రాజెక్టుకు కిలోమీటరుకు సుమారు రూ.320 కోట్ల వరకు ఖర్చవుతుండగా, పీఆర్టీఎస్కు రూ.377 కోట్లకు పైగా అవుతుంది. పైగా మెట్రోలో ఒకసారి వందల మంది ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది. కానీ పీఆర్‌టీఎస్‌లో మాత్రం కేవలం 4-5 మంది మాత్రమే ప్రయాణించవచ్చు.
ఒకవేళ జీఆర్టీఎస్ (గ్రూప్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టం)ను చేపట్టినా గరిష్ఠంగా 20 మంది మాత్రమే ప్రయాణించవచ్చు. ఇంత తక్కువ సామర్థ్యం ఉన్న ప్రాజెక్టును ఎక్కువ వ్యయంతో చేపట్టడం ఎంతవరకు శ్రేయస్కరం అని పలువురు రవాణా రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ప్రస్తుతం ముంబైలో 13 కిలోమీటర్ల పీఆర్టీఎస్ ప్రాజెక్టు నిర్మాణ దశలో ఉండగా… అందులో టికెట్ రేటును కిలోమీటరుకు రూ.21గా ప్రతిపాదిస్తున్నారు. మెట్రోతో పోలిస్తే ప్రయాణికులపై ఛార్జీల భారం రెట్టింపునకు పైగా ఉండటం గమనార్హం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

